కరోనా మరణాల్లో చైనాను మించిన ఇటలీ

Italy death toll rises to 3405 overtaking China - Sakshi

ఇటలీలో 3,405 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా 2.28లక్షలమందిలో వైరస్‌

రోమ్‌/బీజింగ్‌/వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మరణాల్లో ఇటలీ చైనాను మించిపోయింది. ఇటలీలో తాజాగా మరో 427 మంది చనిపోవడంతో ఫిబ్రవరి నుంచి ఈ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య 3,405 కు చేరుకుంది.  చైనాలో గురువారం నాటికి మరణాల సంఖ్య 3,245కు చేరుకుంది.  

చైనాలో కొత్త కేసే లేదు
కరోనా వైరస్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్న చైనాకి గొప్ప ఊరట లభించింది. వ్యాధి విస్తరించిన తర్వాత తొలిసారిగా బుధవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. వూహాన్‌లో స్థానికంగా ఒకరికొకరికి సంక్రమించడాన్ని చైనా నిలువరించగలిగింది. చైనా పక్కా ప్రణాళికతో వైరస్‌పై యుద్ధం ప్రకటించి ఎక్కడికక్కడ అందరినీ నిర్బంధంలో ఉంచడంతో నెల రోజుల క్రితం రోజుకి వెయ్యి కేసులు నమోదయ్యే చోట ఇప్పుడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  చైనాలో పరిస్థితులతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాపై విజయం సాధించడం దుర్లభం కాదన్న ఆశాభావం ఇతర దేశాలకు కలుగుతోంది. ఆసియాలో 3,400 పైగా మరణాలు నమోదయ్యాయి. ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌లలో అత్యధిక సంఖ్యలో కరోనా వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. స్పెయిన్‌లో మరణాలు 209 నుంచి 767కి పెరిగాయి.  (భయాన్ని కాదు.. ధైర్యాన్ని నింపండి)
 
అమెరికా వేల కోట్ల డాలర్ల ప్యాకేజీ
వైరస్‌ సృష్టించిన కల్లోలం నుంచి బయటపడేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అమెరికన్ల ఆరోగ్యం, ఆర్థిక భద్రత అన్న అంశాలే ప్రధానంగా వేలాది కోట్ల డాలర్ల సాయాన్ని అందించడానికి సంబంధించిన బిల్లుపై సంతకాలు చేశారు. ఫ్యామిలీస్‌ ఫస్ట్‌ కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ యాక్ట్‌ పేరుతో రూపొందించిన దీని ద్వారా కరోనా సోకిన వారికి పెయిడ్‌ సిక్‌ లీవ్‌ ఇస్తారు. కోవిడ్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఆహార పదార్థాలు, మందులు వంటి నిత్యావసరాల సాయం అందించడం వంటివి ఈ నిధుల నుంచి చేపడతారు. ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ, అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. కరోనా వైరస్‌ బారిన పడి ఇరాన్‌లో ఒక ఇండియన్‌ ప్రాణాలు కోల్పోయారు. మరో 201 మంది భారతీయుల్ని ఇరాన్‌ నుంచి తీసుకువస్తున్నారు. మరోవైపు సింగపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 90 మంది భారతీయుల్ని విమానంలో తీసుకువస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top