కరోనాపై పోరు: వైద్య సేవలు అందించనున్న ప్రధాని

Ireland PM Doctor Leo Varadkar Register For Health Service In Covid 19 Crisis - Sakshi

డబ్లిన్‌: మహమ్మారి కరోనా ప్రపంచ దేశాలపై కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంటూ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటలీ, స్పెయిన్‌, అమెరికా ఈ ప్రాణాంతక వైరస్‌ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో చికిత్స చేయలేమని స్పెయిన్‌ చేతులెత్తేయగా.. అమెరికాలో కరోనా మృతుల సంఖ్యను ఊహించడం కష్టమేనంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడం కోవిడ్‌-19 తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు వైద్య సిబ్బంది కొరతను ఎదుర్కొనేందుకు విశ్రాంత డాక్టర్లు, నర్సులను తిరిగి విధుల్లో చేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐర్లాండ్‌ సైతం కరోనాను కట్టడి చేసేందుకు వాలంటీర్లు, రిటైర్డు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కోసం రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించింది. ఇందుకు దాదాపు 60 వేల స్పందించి కరోనాపై పోరాటానికి ముందుకు వచ్చారు. వీరిలో ఆ దేశ ప్రధాని లియో వరాద్కర్‌(41) కూడా ఉండటం విశేషం.

కాగా అశోక్‌ వరాద్కర్‌- మిరియం వరాద్కర్‌(డాక్టర్‌- నర్సు) దంపతులకు జన్మించిన లియో.. 2003లో డబ్లిన్‌లోని ట్రినిటీ యూనివర్సిటీ నుంచి వైద్య విభాగంలో పట్టా పొందారు. అనతికాలంలోనే రాజకీయాల్లో ప్రవేశించి దేశ ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో లియో డాక్టర్‌గా విధులు నిర్తర్వించేందుకు వచ్చారని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఆదివారం మీడియాకు వెల్లడించారు. వారంలో ఒకరోజు తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులలో చాలా మంది ఇప్పటికే కరోనాపై పోరుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రధాని సైతం తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు’’అని పేర్కొన్నారు. కాగా కోవిడ్‌-19 కారణంగా ఐర్లాండ్‌లో ఇప్పటి వరకు 158 మంది మృతి చెందగా.. దాదాపు 5 వేల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. (ఆస్పత్రిలో చేరిన బ్రిటన్‌ ప్రధాని)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top