
లిబియా ప్రధాని కిడ్నాప్... విడుదల
లిబియా తాత్కాలిక ప్రధాని అలీ జీదాన్ కిడ్నాప్‌కు గురి కావటం గురువారం కలకలం సృష్టించింది. నాటకీయ పరిణామాల అనంతరం కొద్ది గంటల వ్యవధిలోనే తిరుగుబాటుదారులు ఆయన్ను క్షేమంగా విడిచిపెట్టారు.
ట్రిపోలి: లిబియా తాత్కాలిక ప్రధాని అలీ జీదాన్ కిడ్నాప్‌కు గురి కావటం గురువారం కలకలం సృష్టించింది. నాటకీయ పరిణామాల అనంతరం కొద్ది గంటల వ్యవధిలోనే తిరుగుబాటుదారులు ఆయన్ను క్షేమంగా విడిచిపెట్టారు. ట్రిపోలీలోని జీదాన్ బస చేసిన కొరింథియా హోటల్‌లోకి చొరబడిన కొందరు సాయుధులు ఆయన్ను తెల్లవారుజామున అజ్ఞాత ప్రాంతానికి తరలించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అనంతరం జీదాన్ విడుదలైనా ఘటనకు పూర్తి కారణాలు వెల్లడి కాలేదు. అల్‌కాయిదాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న అబు అనాస్ అల్ లిబిని ఐదు రోజుల క్రితం అమెరికా కమాండోలు ట్రిపోలీ వీధుల్లో నిర్బంధించి యుద్ధనౌకలోకి తరలించటంపై తిరుగుబాటుదారులు మండిపడుతున్నారు. దీనికి నిరసనగానే జీదాన్‌ను కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఉత్తర్వుల మేరకే తాము జీదాన్‌ను అరెస్టు చేసినట్లు తిరుగుబాటుదారులు పేర్కొన్నారు.