కెనడాలో కాల్పుల మోత

Gunman eliminates 18 in Nova Scotia in Canada is deadliest shooting - Sakshi

దుండగుడి కాల్పుల్లో మహిళా పోలీసుసహా 18 మంది మృతి

పోలీసుల చేతిలో సాయుధుడి హతం

టొరంటో: కెనడా చరిత్రలోనే అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో మహిళా పోలీసు అధికారి సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. ఈ దారుణం నొవాస్కోటియా ప్రావిన్స్‌ పొర్టాపిక్‌ పట్టణంలో ఆదివారం జరిగింది. గాబ్రియేల్‌ వర్ట్‌మన్‌(51) హాలిఫాక్స్‌ సమీపంలోని డార్ట్‌మౌత్‌లో కృత్రిమ దంతాలు అమర్చే పని చేస్తుంటాడు. ఇతడికి పొర్టాపిక్‌లో సొంతిల్లు ఉంది. పోలీసు యూనిఫాం ధరించి, పెట్రోలింగ్‌ వాహనం మాదిరి ఎస్‌యూవీలో తనుండే వీధిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి అందులోని వారిని కాల్చి చంపాడు.

అనంతరం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని మరోప్రాంతంలో కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని ఇళ్లకు నిప్పుకూడా పెట్టాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా పోలీసు అధికారి చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనల్లో వర్ట్‌మన్‌తోపాటు సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రశాంతతకు మారుపేరైన తమ పట్టణంలో ఇంతటి ఘోరం జరుగుతుందని తాము ఎన్నడూ ఊహించలేదని స్థానికులు తెలిపారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 1989లో మాంట్రియేల్‌లోని ఎకోల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో మార్క్‌ లెపిన్‌ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో 14 మంది మహిళలు చనిపోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top