గూగుల్‌, అమెజాన్‌లకు ఫ్రాన్స్‌ షాక్‌

France will Impose a Digital Tax On America Companies - Sakshi

పారిస్‌ : తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వీలు చిక్కినప్పుడల్లా చైనా, భారత్‌ తదితర దేశాలను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫ్రాన్స్‌ చట్టసభ డిజిటల్‌ ఇంటర్నెట్‌ కంపెనీలపై నూతన సర్వీస్‌ టాక్స్‌ విధించాలని తెచ్చిన బిల్లును ఆమోదించింది. ఇదే జరిగితే అమెరికా కంపెనీలు అయిన అమేజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలు ఇకపై తమ సంపాదనలో అధికభాగం పన్ను రూపంలో ఫ్రాన్స్‌కు చెల్లించుకోవల్సిందే. ఈ నిర్ణయంతో ట్రంప్‌ నుంచి వ్యతిరేకత ఎదురైనా ముందుకే వెళ్లాలని ఫ్రాన్స్‌ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్య అమెరికా కంపెనీలపైనే ప్రధాన ప్రతికూలత చూపేలా ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధులు అంటున్నారు. దీంతో అమెరికా కూడా ఫ్రెంచ్‌ ఉత్పత్తులపై సుంకాలు పెంచి ప్రతీకారచర్యకు దిగవచ్చని చెప్పారు. ‘డిజిటల్ సేవల పన్ను .. అన్యాయంగా అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుందని’ యుఎస్ ట్రేడ్ ప్రతినిధి రాబర్ట్ లైట్జైజర్ వాపోయారు.  ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ‘ఇక్కడ అమెరికా  ప్రతీకార చర్యలకు పాల్పడేది ఏమీ లేదని, చర్చల ద్వారా సమస్యను మేం పరిష్కరించుకుంటామని’ తెలిపారు. కాగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మెక్రాన్‌ సంతకం చేస్తేనే ఈ బిల్‌  అమలులోకి వస్తుంది.

ఫ్రాన్స్‌తో పాటు ఇతర యూరప్‌ దేశాలు సైతం ఇదే బాటలో ఉన్నాయి. డిజిటల్‌ కంపెనీలపై నూతనంగా పన్నులు విధించడం ద్వారా మరింత ఆదాయాన్ని పొందడమే గాక, ఇంటర్నెట్‌ను నియంత్రించడానికి వీలు కలుగుతుందని ఆయా దేశాల ఆలోచన. ముఖ్యంగా బ్రిటన్‌ ఏప్రిల్‌ 2020 కంతా డిజిటల్‌ కంపెనీలపై 2 శాతం పన్ను విధించాలని చూస్తోంది. జూన్‌లో జరిగిన జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా డిజిటల్‌ కంపెనీలపై పన్ను విధింపులు, సవాళ్లు ఏమున్నాయో చర్చకు సైతం వచ్చింది. పెరుగుతున్న డిజిటల్‌​ ఆర్థిక వ్యవస్థపై ఒక అంతర్జాతీయ పన్ను విధానం తీసుకురావడానికి మరిన్ని చర్చలు అవసరం అని యుఎస్‌ ప్రతినిధుల వాదన. కానీ ఫ్రాన్స్‌ మాత్రం డిజిటల్‌ కంపెనీలపై పన్ను విధింపులో కాస్త దూకుడుగానే ఉంది. మరి చైనా, భారత్‌ వస్తువులపై టారిఫ్‌లు పెంచేసి వాణిజ్యయుద్ధం ప్రారంభించిన ట్రంప్‌ ఇప్పుడు తమ మిత్రదేశం ఫ్రాన్స్‌ తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top