జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం | fire accident in jeddah, telugu people affected | Sakshi
Sakshi News home page

జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

Sep 5 2014 2:13 PM | Updated on Sep 5 2018 9:45 PM

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ తెలుగు కార్మికులు ఉండే కంటెయినర్లు మొత్తం తగలబడిపోయాయి.

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ తెలుగు కార్మికులు ఉండే కంటెయినర్లు మొత్తం తగలబడిపోయాయి. ప్రధానంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయానికి ఎక్కువ మంది విధులకు వెళ్లడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలోనే ప్రమాదం సంభవించింది. ఆ సమయానికి చాలామంది వెళ్లిపోయినా, కొంతమంది మాత్రం ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం వల్ల దాదాపు పది లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది.

ఈ ప్రమాదం గురించి అశోక్ అనే బాధితుడు 'సాక్షి'తో జెడ్డా నుంచి ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలివీ.. 'మూడు నాలుగు కంటెయినర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అవి ఇక ఏమాత్రం పనికిరావు. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కొంతమంది మాత్రం నిద్రిస్తున్నారు. చాలామంది ఉద్యోగాలకు వెళ్లారు. అక్కడ సుమారు 200-250 మంది తెలుగువాళ్లు ఉన్నారు. ప్రాణనష్టం లేకపోయినా, గదులలో ఉన్న డబ్బులు, బియ్యం, వస్తువులు అన్నీ పూర్తిగా దగ్ధం అయిపోయాయి. అసలే కంపెనీ నుంచి జీతాలు కూడా సరిగా రాని ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో సర్వస్వం కోల్పోయాం'.

Advertisement
 
Advertisement
Advertisement