‘ఉగ్ర’ అడ్డాగానే పాక్ | Federally administered Tribal Areas | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ అడ్డాగానే పాక్

Jun 21 2015 4:36 AM | Updated on Apr 4 2019 5:12 PM

‘ఉగ్ర’ అడ్డాగానే పాక్ - Sakshi

‘ఉగ్ర’ అడ్డాగానే పాక్

పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగానే కొనసాగుతోందని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది.

* అమెరికా విదేశాంగ శాఖ వెల్లడి
* ఆగని లష్కరే కార్యకలాపాలు

వాషింగ్టన్: పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగానే కొనసాగుతోందని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. ముఖ్యంగా పాక్‌లోని వజీరిస్తాన్, బలూచిస్తాన్‌సహా అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలు ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా ఉన్నాయని ఉగ్రవాదంపై రూపొందించిన తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పాక్‌కు చెందిన ఎఫ్‌ఏటీఏ(ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్), వాయువ్య ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రం, ఆగ్నేయ బలూచిస్తాన్ ప్రవిన్స్‌లోని కొన్ని ప్రాంతాలు సైతం ఉగ్రవాదులకు నిలయాలుగా భాసిల్లుతున్నాయని పేర్కొంది.

అల్‌కాయిదా, హక్కానీ నెట్‌వర్క్, తె హ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) లష్కర్-ఐ-జంఘ్వీ తదితర టైస్టు గ్రూపులు, అలాగే అఫ్ఘా తాలిబాన్ గ్రూపులు ఈ ప్రాంతంనుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వివరించింది. పాకిస్తాన్‌లోను, అలాగే ఈ ప్రాంతమంతటా కార్యకలాపాలు సాగించేందుకు ఇక్కడినుంచే పక్కా ప్రణాళికలకు వ్యూహరచన చేస్తున్నాయని తెలిపింది. 2014లో పాక్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టి ఉత్తర వజీరిస్తాన్ ఏజెన్సీ, ఖైబర్ ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని, ఇది టీటీపీపై ప్రభావం పడినా.. మరికొన్ని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు ఆగలేదని పేర్కొంది.
 
లష్కరేపై పాక్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు
టీటీపీ వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలపై సైనికచర్య చేపట్టిన పాకిస్తాన్.. తమ దేశం నుంచి పనిచేస్తున్న లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ), తదితర ఉగ్రవాద సంస్థలపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తాజా నివేదికలో అమెరికా స్పష్టం చేసింది. ఎల్‌ఈటీ తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉందని, శిక్షణ, ప్రచారం, నిధుల సమీకరణ వంటి చర్యలకు పాల్పడుతూనే ఉందని తెలిపింది. భారతదేశం ఉగ్రవాదుల లక్ష్యంగానే ఉందని పేర్కొంది. పాక్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలు, అలాగే ఇస్లామిక్ స్టేట్, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి పొంచివున్న ముప్పును భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement