అమెరికా : న్యూయార్క్‌లో పేలుడు

explosion on New York's  Manhattan subway line - Sakshi

న్యూయార్క్‌ : అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ నగరంలో భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రఖ్యాత మాన్‌హట్టన్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం 7:45 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ సమీపంలోని పోర్ట్‌ అథారిటీ బస్‌ టెర్మినల్‌ వద్ద పేలుడు కేంద్రాన్ని గుర్తించారు. ఈ మేరకు న్యూయార్క్‌ మేయర్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌(ఎన్‌వైపీడీ) ఇప్పటికే ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుందని, పోర్ట్‌ రవాణా కేంద్రంలోని ఏ, సీ, ఈ లైన్లను తాత్కాలికంగా మూసివేశారని అధికారులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రత ఎంత, ఎవరికైనా ప్రాణాపాయం కలిగిందా, గాయపడ్డారా, లేదా అనే వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

ఒకటికాదు రెండు పేలుళ్లు!
మాన్‌హట్టన్‌ పేలుడుకు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టెర్మినల్‌లో బదిగిన తనకు రెండు సార్లు భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయని, ఆ సమయంలో హెడ్‌సెట్‌ పెట్టుకున్నప్పటికీ చెవులు ఘొల్లుమన్నాయని ఫ్రాన్సిస్కో అనే ప్రయాణికుడు తెలిపారు. పేలుడు ఉగ్రదాడా, లేక మరొకటా అన్నది మరికాసేపట్లోనే అధికారులు వెల్లడించనున్నారు..

సొంత ఊర్లో పేలుడుపై అధ్యక్షుడు ట్రంప్‌ ఆరా..
మాన్‌హట్టన్‌ బస్‌ టెర్మినల్‌ పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అధికారులతో మాట్లాడారు. మాన్‌హట్టన్‌లో ఏం జరిగిందో, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఎన్‌వైపీడీ.. ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు వివరించిందని వైట్‌హౌస్‌ మీడియా ప్రతినిధి తెలిపారు. ట్రంప్‌ సొంత ఊరు న్యూయార్క్‌ సిటీనే అన్న సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top