టెహ్రాన్: తమ దేశంపై అమెరికా దాడులు చేయనున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. వైట్‌హౌస్ ప్రయత్నాలను తాము విఫలం చేస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ మహమ్మద్ బక్పూర్ స్పష్టం చేశారు.
‘‘శత్రువు(అమెరికా) వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా.. తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏ దాడినైనా ఎదుర్కొనే సామర్థ్యం, పూర్థిస్థాయి సన్నద్ధత మాకు ఉంది. శక్తిమంతమైన ఇరాన్‌కు వ్యతిరేకంగా వైట్‌హౌస్ పావులు కదుపుతూ.. భ్రమల్లో బతుకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు.. ఇద్దరూ ఇరాన్ యువత హంతకులే’’ అని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు
ట్రంప్, నెతన్యాహుల కిరాయి సేనలు చేసిన క్రూరమైన దాడులను ఇరాన్ ఎప్పటికీ మరిచిపోదని, ఈసారి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. కాగా.. ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోందని పాశ్చాత్య, పశ్చిమాసియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇక్కడ దాడులు జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాతోపాటు.. బ్రిటన్ కూడా పశ్చిమాసియాలోని తమ బేస్‌లలో ఉన్న సైన్యం, వైమానిక దళాలను వెనక్కి రప్పిస్తున్నాయి.


