ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

Egypt Opens ‘Bent Pyramid’ for 1st Time in Decades - Sakshi

కైరో : కొన్ని దశాబ్దాల తర్వాత ఈజిప్టులో అత్యంత ప్రాచీనకాలానికి చెందిన పిరమిడ్‌ సందర్శనకై పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. దీని పేరు బెంట్‌ పిరమిడ్‌. ఇది ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన  28 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తుపూర్వం 4600 సంవత్సరాల క్రితం దీన్ని ఈజిప్టు నాల్గవ రాజవంశానికి చెందిన కింగ్‌ స్నెఫేరు కోసం నిర్మించారు. ఈ బెంట్‌ పిరమిడ్‌ను తెరవడంతో పిరమిడ్‌ నిర్మాణాలపై పరిశోధనలకు మరింత ఊతం ఇ‍వ్వనుందని పురావస్తు శాస్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 101 మీటర్ల ఎత్తుతో అసాధారణంగా ఉన్న ఈ పిరమిడ్‌ తర్వాత కాలంలో పిరమిడ్‌ల నిర్మాణానికి అత్యున్నత దశగా పేర్కొనే ప్రఖ్యాత గిజా పిరమిడ్‌ కట్టడానికి మార్గదర్శి అని తెలిపారు.

ఇది తొలిదశలో నిర్మించిన పిరమిడ్‌లకు, తర్వాత తరంలోని పిరమిడ్‌లకు మధ్య వారధిలా నిలిచిందని పేర్కొన్నారు. బెంట్‌ పిరమిడ్‌లో 79 మీటర్లు ఉండే ఇరుకైన సొరంగమార్గం గుండా ప్రధాన చాంబర్‌కు చేరుకోవచ్చు. ఈజిప్టు పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖా మంత్రి ఖలీద్‌ మాట్లాడుతూ 1965లో దీన్ని మూసివేశామని, బెంట్‌పిరమిడ్ తో పాటు అల్కాడాగ్మటిక్‌ అనే మరో పిరమిడ్‌లో కూడా సందర్శకులకు అనుమతి ఇచ్చామన్నారు.  బెంట్‌పిరమిడ్‌, పిరమిడ్‌ల నిర్మాణానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. అలాగే సమీప ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 4,000 సంవత్సరాల నాటి పురాతన అవశేషాలను కనుగొన్నారు. ‘రాయి, బంకమట్టి మరియు చెక్క నిర్మాణాలతో కూడిన మమ్మీపై భాగాలు దొరికాయని, అలాగే కొన్ని మమ్మీలు కనుగొన్నామని ’ పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Election 2024

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top