ఆ రూల్స్ బ్రేక్ చేస్తే.. అమెరికాను వదలాల్సిందే!
డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలతో విదేశీయులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది.
డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలతో విదేశీయులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ట్రాఫిక్ నిబంధనల నుంచి ఏ చిన్న నిబంధనను ఉల్లంఘించినా దేశం నుంచి పంపించేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు మంగళవారం విడుదల చేసిన కొత్త ఇమిగ్రేషన్ పాలసీలో ఉన్నాయి. కొత్త పాలసీకి సంబంధించిన పత్రాలపై సెక్రటరీ జాన్ కెల్లీ సంతకాలు కూడా పూర్తయ్యాయని హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్(డీహెచ్‌ఎస్) పేర్కొంది. పాలసీ ప్రకారం అక్రమంగా బోర్డర్ దాటిన వారిన, చిన్న తప్పులను చేసిన వారిని అమెరికా ఇక ఏ మాత్రం ఉపేక్షించకుండా పంపేస్తుంది.
ఒబామా సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం విదేశీయులను ప్రధానంగా రెండు తప్పులు చేసినప్పుడు మాత్రమే దేశం నుంచి పంపేసింది. అవి వీసా గడువు పూర్తయినా కూడా అమెరికాలో నివసిచడం. మరొకటి అనుమతి లేకుండా సరిహద్దులు దాటడం. ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటివరకూ నేర చరిత్ర కల విదేశీయులను దేశ భద్రతకు ఆటంకం కలిగించేవారుగా పరిగణించాలని నిర్ణయించింది. అంటే వారందరినీ తిరిగి స్వదేశాలకు పంపేస్తారన్నమాట.
కొత్త నిబంధనలు-ప్రభావాలు
- కొత్త నిబంధనల వల్ల డీహెచ్‌ఎస్ పని సులువు అవుతుంది. సరిహద్దులో భద్రత, అక్రమ వలసదారులను ఇమిగ్రేషన్ అధికారులు సులువుగా వెనక్కు పంపే వీలు కలుగుతుంది.
- అనధికారక లెక్కల ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న మూడు లక్షల మందికి పైగా భారతీయ అమెరికన్లపై కొత్త నిబంధనలు ప్రభావం చూపుతాయి.
- వలసదారుల కేసులు కోర్టుల్లో ఉన్నా వారిని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్బంధించే అవకాశం ఉంది. అదే మెక్సికోకు చెందిన వారి దగ్గర సరైన పత్రాలు లేకపోతే వారిని వెంటనే తిరిగి వెనక్కు పంపేస్తారు.
- అమెరికా-మెక్సికోల మధ్య రెండు వేల మైళ్ల పాటు నిర్మించనున్న గోడపై కూడా ఈ పాలసీలో క్లారిటీ ఇచ్చారు.
- మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశించిన ఇతర దేశస్ధులను మెక్సికోకు తిరిగి పంపేయాలని తాజా పాలసీలో నిర్ణయించారు.
- కొత్తగా 10 వేల ఉద్యోగాలు యూఎస్ ఇమిగ్రేషన్‌లో, 5 వేల ఉద్యోగాలు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్స్‌లో భర్తీ చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు.