భారత ప్రజలకు ధన్యవాదాలు: ట్రంప్‌

Donald Trump Thanks India For Allowing Key Drug Export Covid 19 - Sakshi

‘‘అసాధరణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరం. హైడ్రాక్సీక్లోరో​క్విన్‌పై భారత ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. ఈ మేలు మర్చిపోము! భారత్‌ను ముందుకు నడిపించే మీ బలమైన నాయకత్వం.. ఈ యుద్ధంలో మానవతా దృక్పథం అవలంబిస్తున్న తీరుకు మోదీకి కృతజ్ఞతలు’’అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడంలో సత్ఫలితాలను ఇస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారరు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.(భారత్‌ నుంచి 29 మిలియన్‌ డోసుల డ్రగ్‌.. ట్రంప్‌ హర్షం)

కాగా కరోనాతో అల్లాడుతున్న దేశాలకు మానవతా దృక్పథంతో అత్యవసరమైన మందులు సరఫరా చేస్తామని భారత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికాకు దాదాపు 29 మిలియన్‌ డోసుల డ్రగ్స్‌ను ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌..‘‘సమస్యలు తలెత్తిన తరుణంలో మా అభ్యర్థనను మన్నించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఆయన అద్భుతమైన వ్యక్తి. మేము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం’’ అని పేర్కొన్నారు. తమకు సహాయపడనట్లయితే వాణిజ్యపరంగా భారత్‌పై ప్రతీకార చర్య చేపట్టే అవకాశం ఉంటుందని ట్రంప్‌ తొలుత హెచ్చరించిన విషయం తెలిసిందే.(అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్‌ )

ఇక మహమ్మారి కరోనా సోకి అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 14 వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డారు. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కాగా కరోనాతో అమెరికాలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 11కు చేరినట్లు సమాచారం. ఇక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాల్సిందిగా అమెరికాతో పాటు బ్రెజిల్‌ సహా 30 దేశాలు భారత్‌ను అభ్యర్థించాయి. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికాకు సదరు మాత్రలు సరఫరా చేసిన భారత్‌.. బ్రెజిల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించినందుకు ఆ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.(మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్‌ అధ్యక్షుడు)

డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తాం: ట్రంప్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top