రెండు నెలల పాటు నో ఎంట్రీ

Donald Trump signs order to suspend immigration to US for 60 days - Sakshi

అమెరికా వీసాలపై తాత్కాలిక నిషేధం

ఉత్తర్వులపై సంతకం చేసిన అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్‌ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడుట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలోకి ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్న వారికే ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఇవి వర్తించవన్నారు.

అమెరికన్ల ఉద్యోగాల రక్షణ కోసం అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశానన్నారు. కరోనాతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మళ్లీ ఉపాధి కల్పించాల్సి∙ఉందన్నారు. వలసలకు విరామం ఇవ్వడం ద్వారా.. కరోనా ప్రభావం అంతమై, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక దేశంలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్లకే లభిస్తాయన్నారు. అమెరికన్లకు కాకుండా, కొత్తగా వచ్చిన విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అన్యాయమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత నిషేధం తొలగించాలా? కొంతకాలం కొనసాగించడమా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు.

మినహాయింపులు
ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పలు మినహాయింపులు ఉన్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమెరికా వీసా, లేదా గ్రీన్‌ కార్డ్‌ ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించబోవు. ఆ తేదీ నాటికి విదేశాల్లో ఉన్న, ఎలాంటి ఇమిగ్రంట్‌ వీసా కానీ, లేదా వేరే ఏ అధికారిక ట్రావెల్‌ డాక్యుమెంట్‌ కానీ లేనివారికే అవి వర్తిస్తాయి. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు రావాలనుకుంటున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి, ఇన్వెస్ట్‌మెంట్‌ కేటగిరీలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితులుగా రావాలనుకుంటున్నవారికి ఈ నిషేధం వర్తించదు.

అమెరికన్ల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్లలోపు పిల్లలు, అమెరికన్లు దత్తత తీసుకోవాలనుకునేవారు నిషేధ పరిధిలోకి రారు. అన్ని రకాల ఇమిగ్రంట్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ఇటీవల ట్రంప్‌ చెప్పడం తెల్సిందే. ఐటీ నిపుణులు, వ్యవసాయ కార్మికుల అందుబాటుపై ఈ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక, రాజకీయ వర్గాలు విమర్శించాయి. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడంలో తన వైఫల్యాన్ని.. ట్రంప్‌ ఇలా కప్పిపుచ్చుకుంటున్నారని డెమొక్రాట్లు విమర్శలు గుప్పించారు.

భారత్‌ సమీక్ష
వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అమెరికా జారీ చేసిన ఉత్తర్వులను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఉత్తర్వులు భారతీయులపై, భారత్‌–అమెరికాల మధ్య సంబంధాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top