డిప్రెషన్‌, ఆందోళనతో గుండెజబ్బులు ఎక్కువవుతాయి..

Depression And Anxiety Causes Heart Diseases In Middle Age - Sakshi

ఎడిన్‌బర్గ్‌ : నడివయస్సులో మానసిక ఒత్తిడి(డిప్రెషన్‌), ఆందోళనల కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల మహిళలలో గుండెపోటు వచ్చే అవకాశం 44శాతం ఎక్కువని స్కాట్లాండ్‌కు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్‌ ఈడెన్‌బర్గ్‌’’ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పురుషులలో 45-79 సంవత్సరాల వయస్సు గల వారిలో మానసిక ఒత్తిడి కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన 2,21,677 మందిపై ఈ బృందం పరిశోదనలు జరిపింది.

మానసిక ఒత్తిళ్లలో తేడాలను బట్టి వారిని మూడు విభాగాలుగా విభజించారు. మానసిక ఒత్తిళ్ల స్థాయిని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు వారిని పది ప్రశ్నలు అడిగారు. 1,02,039 మంది పురుషులలో (ప్రామాణిక వయస్సు 62), 1,19638 మంది మహిళలలో(ప్రామాణిక వయస్సు 60) 16.2 శాతం మంది మధ్యస్తమైన మానసిక ఒత్తిడిని కలిగి ఉన్నారని,7.3 శాతం మంది అధిక మానసిక ఒత్తిడిని కలిగి ఉన్నారని తేలింది. దాదాపు నాలుగేళ్ల అనంతరం వారిలో 4వేల గుండెపోట్లు, 2 వేల స్ట్రోక్‌లు నమోదైనట్లు వారు గుర్తించారు. వ్యక్తుల జీవన విధానాలను బట్టి వారి మధ్య జబ్బు తీవ్రతలో తేడాలుండొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top