వియత్నాం యుద్ధాన్ని మించి.. | COVID19: Coronavirus in three months than were killed in Vietnam War | Sakshi
Sakshi News home page

వియత్నాం యుద్ధాన్ని మించి..

Apr 30 2020 4:15 AM | Updated on Apr 30 2020 4:31 AM

COVID19: Coronavirus in three months than were killed in Vietnam War - Sakshi

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ప్రాస్పెక్ట్‌ పట్టణంలో ఆహార పొట్లాల కోసం కార్లలో వేచి ఉన్న జనం

వాషింగ్టన్‌: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్‌  అమెరికాలో వియత్నాం యుద్ధం కంటే ఎక్కువ మందిని బలితీసుకుంది. అమెరికాలో పదిలక్షలకుపైగా కోవిడ్‌ కేసులు ఉండగా, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60వేలు దాటింది. ఇది ఇరవై ఏళ్లపాటు వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 1955లో మొదలైన వియత్నాం యుద్ధం 1975లో ముగియగా 58,220 మంది అమెరికన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. పదిలక్షల కంటే ఎక్కువమంది కరోనా బాధితులున్న తొలిదేశంగానూ అమెరికా ఓ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 32 లక్షలకు చేరువలో ఉంది.

‘బాధితులు ఆత్మశాంతి కోసం, ఆప్తులను కోల్పోయి శోక సంద్రంలో ఉన్న వారి బంధు మిత్రుల కోసం మా ప్రార్థనలు కొనసాగుతాయి. ఇలాంటిది ఎప్పుడూ లేదు. ఇది అందరి కష్టం. ఈ కష్టం నుంచి త్వరలోనే మరింత బలంగా బయటపడతాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశమూ చేయనంత పెద్ద సంఖ్యలో తాము కరోనా పరీక్షలు నిర్వహించామని, నిపుణుల సలహా మేరకు ఇది జరిగిందని కాకపోతే అప్పుడప్పుడూ నిపుణులు తప్పులు చేస్తారని ట్రంప్‌ అన్నారు.  దేశాన్ని, సరిహద్దులను మూసివేస్తామని నిపుణులెవరూ ఊహించలేదని ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగవ త్రైమాసికాల్లో అమెరికా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత ఎలా జరగాలన్న అంశంపై ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. మాస్టర్‌కార్డ్‌ సీఈవో, భారతీయ సంతతికి చెందిన అజయ్‌ బంగా, టండన్‌ కేపిటల్‌ అసోసియేట్స్‌కు చెందిన చంద్రిక టండన్, హోటల్స్‌ అసోసియేషన్‌ సీఈవో విజయ్‌ దండపాణిలు ఈ బృందం సభ్యులుగా నియమితులయ్యారు.  

184 దేశాలు నరకం అనుభవించాయి
చైనా కరోనా వైరస్‌ను ఆదిలోనే అదుపు చేసి ఉంటే 184 ప్రపంచదేశాలు నరకం అనుభవించాల్సిన దుస్థితి తప్పేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఖనిజాలు, తయారీ రంగం కోసం చైనాపై ఆధారపడకూడదని పలువురు అమెరికన్‌ పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడుతున్న తరుణంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యూహాత్మకంగా అవసరమైన పలు ఖనిజాల విషయంలో అమెరికా అమెరికా చైనాపై ఆధారపడుతూండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంపై ఆధారపడటం, దేశాన్ని బలహీన పరుస్తుందని అమెరికా భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా పలువురు రాజకీయ నేతలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement