కేసులు 70 లక్షలు..మృతులు 4 లక్షలు...

COVID-19: Corona virus Updates from around the world - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ

గణాంకాల్ని నిలిపివేసిన బ్రెజిల్‌

వాషింగ్టన్‌/లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాటిన్‌ అమెరికా, రష్యా భారత్‌లో కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నాటికి 70 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో లాటిన్‌ అమెరికాలో 16 శాతం కేసుల వరకు నమోదయ్యాయి. 24 గంటల్లోనే 2,680 మంది ప్రాణాలు కోల్పోవడంతో కోవిడ్‌ మృతుల సంఖ్య 4 లక్షలు దాటినట్టు హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  ఆరోగ్య నిపుణులు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతుల్లో చాలా మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల అధికారిక లెక్కల్లో తేడాలు ఉన్నాయన్నది వారి అభిప్రాయం. మొత్తం మృతుల్లో నాలుగో వంతు అమెరికాలోనే సంభవించాయి. మరోవైపు దక్షిణ అమెరికాలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

23 రోజుల్లో లక్ష మరణాలు
ప్రపంచవ్యాప్తంగా మలేరియాతో మరణించే వారి సంఖ్యతో సమానంగా కోవిడ్‌ మృతులు అయిదు నెలల్లోనే సంభవించాయి. చైనాలోని వూహాన్‌లో జనవరి 10న తొలి మరణం సంభవించింది. లక్ష మరణాలు నమోదు కావడానికి మూడు నెలలు పట్టింది. ఏప్రిల్‌ మొదటి వారంలో మృతులు లక్ష దాటేశాయి. అదే నెల చివరి వారంలో 2 లక్షలు దాటేశాయి. ఇక 23 రోజుల్లో మరణాలు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు చేరుకున్నాయి.  

ఏడు లక్షలకు చేరువలో బ్రెజిల్‌..
లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. 7 లక్షలకి చేరువవుతున్న కేసులతో ఆ దేశం ప్రపంచ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 36 వేలకు పైగా మరణాలతో మూడో స్థానంలో ఉంది. అయితే శనివారం నుంచి అక్కడ ప్రభుత్వం కరోనా కేసులు, మరణాల వివరాలను అధికారికంగా వెల్లడించడం నిలిపివేసింది.  దేశంలో పరిస్థితిని ఆ గణాంకాలు సరిగా తెలియజేయడం లేదంటూ బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో ట్వీట్‌ చేశారు.  

అమెరికాలో 20 లక్షలు కేసులు  
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్‌–19 కేసుల పెరుగుదల ఆగడం లేదు. ప్రతీ రోజూ సగటున 20 వేల వరకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రపంచదేశాల్లో నమోదైన కేసుల్లో 30శాతం అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం 20 లక్షలకు చేరువలో ఉన్నాయి. మృతుల్లో కూడా అగ్రరాజ్యమే మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో  మృతుల సంఖ్య లక్షా 12 వేలు దాటేసింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top