వణికిపోతున్న అమెరికా..

Corona Effect: United States Govt has announced holidays for educational institutions - Sakshi

కోవిడ్‌ దెబ్బకు మూతపడ్డ అమెరికా విశ్వవిద్యాలయాలు

ప్రజా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు నిరవధిక సెలవులు

ఇంటి నుంచే పనిచేయాలన్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్, గూగుల్‌

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ అమెరికా ప్రభుత్వం అక్కడి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, వైట్‌హౌస్‌ సహా (అత్యవసర సేవలు మినహా) ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు పెట్టుకోరాదని సూచించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్, ఫేస్‌బుక్‌ తన ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. వేలాది మంది ప్రయాణికులతో కిటకి టలాడే న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెలిస్, సియాటిల్, షికాగో విమానాశ్రయాల్లో ఇప్పుడు సందడి లేదు.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక నగరం నుంచి మరో నగరానికి కూడా రాకపోకలు దాదాపు తగ్గాయి. యూరోపియన్‌ దేశాల నుంచి విమానాలు రద్దు చేయడంతో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తక్కువగా కన్పిస్తున్నారు. సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన శాన్‌జోస్, శాన్‌ఫ్రాన్సిస్కోలో పనిచేసే వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచే స్తుండటంతో రోడ్లు నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. న్యూయార్క్‌ డౌన్‌టౌన్‌లో రాత్రి 10 గంటలయ్యే సరికి జన సంచారం తగ్గిపోతోంది. న్యూయార్క్‌లో అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు మాత్రమే తగిన జాగ్రత్తలతో విధులకు హాజరవుతున్నారు.

ఇంటి బాట పడుతున్న మనోళ్లు..
అమెరికాలోని స్కూళ్లు, కాలేజీలకు నిరవధిక సెలవులు ప్రకటించడంతో అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న వేలాది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తిరుగు ముఖం పడుతున్నారు. విమాన చార్జీలు తక్కువగా ఉండటంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో భారత్‌కు తిరిగి వెళ్తున్నారని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఓ కథనంలో పేర్కొంది. భారత్‌లో కోవిడ్‌ వైరస్‌ ఉన్నా అమెరికాతో పోలిస్తే తక్కువగా ఉండటమే దీనికి కారణమని ఆ పత్రిక పేర్కొంది. వర్క్‌ ఫ్రం హోం వల్ల ఐటీ ఉద్యోగులు కూడా స్వస్థలాలకు పయనమయ్యారు. కనీసం నెల రోజుల కంటే ఎక్కువ వర్క్‌ ఫ్రం హోం ఉంటుందని, ఈ సమయాన్ని తల్లిదండ్రులతో గడపాలని హైదరాబాద్‌ వచ్చినట్లు అమెజాన్‌ ఉద్యోగి రవికిషోర్‌ చెప్పారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనను పరీక్షించి, ఆరోగ్యంగా ఉన్నానని నిర్ధారించాకే ఇంటికి పంపినట్లు నూకల అనూష గుర్తుచేసుకున్నారు. జర్మనీ నుంచి వచ్చిన ఓ ఐటీ ఉద్యోగి దగ్గుతో బాధపడుతుండటంతో అతడిని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.

ప్రయాణాలు రద్దు చేసుకున్న భారతీయులు
మార్చి 15 నుంచి జూన్‌ 30 వరకు అమెరికా, యూరప్‌ దేశాల్లో పర్యటించాలనుకున్న భారతీయులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. మార్చి 15–31 మధ్య తమ విమానాల్లో అమెరికాలోని వివిధ నగరాలకు వెళ్లాలనుకుని టికెట్లు బుక్‌ చేసుకున్న వారిలో 88 శాతం మంది రద్దు చేసుకోవడమో లేదా గడువు పెంచుకోవడమో చేశారని ఎమిరేట్స్‌ ప్రతినిధి తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top