విమానం కొనలేనుగా.. అందుకే ఇలా..

Chinese Garlic Farmer Builds His Own Plane - Sakshi

ఈశాన్య చైనాలో ఎయిర్‌బస్‌కు సంబంధించిన కొత్త విమానం ఎయిర్‌బస్‌ ఏ320 రూపుదిద్దుకుంటోంది. పంట పొలాల మధ్య.. ఘుమఘుమలాడే రుచులతో ప్యాసింజర్లకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతోంది. అదేంటి విమానం విమానాశ్రయంలోనో.. రన్‌వే మీదో ఉండాలి గానీ పంటపొలాల మధ్య ఉండటమేంటని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది ఎగిరే విమానం కాదు. తన చిన్న నాటి కలను నెరవేర్చుకునేందుకు ఓ రైతు చేసిన వినూత్న ఆలోచనకు నిదర్శనం.

జూ యూ.. చైనాకు చెందిన రైతు. ఇతడు ఉల్లి, వెల్లుల్లి పంటలు సాగు చేస్తూంటాడు. విమానాలంటే పడిచచ్చే జూ యూకు చిన్ననాటి నుంచి  విమానం కొనాలనే కోరిక ఉండేది. కానీ ఓ సామాన్య రైతుకు ఇది సాధ్యమయ్యే పనికాదు కదా. అందుకే విమానాన్ని కట్టాలనే నిర్ణయానికి వచ్చేసాడు. ఈశాన్య చైనాలోని గోధుమ చేల మధ్య ‘విమాన హోటల్‌’ ను నిర్మిస్తున్నాడు. ఇందుకోసం తను సంపాదించిన మొత్తాన్ని (2.6 మిలియన్‌ యువాన్లు- దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు) ఖర్చు పెడుతున్నాడు.

అచ్చం నిజమైన విమానంలా కన్పించేలా..
తన చిరకాల కోరికను ఈరకంగానైనా తీర్చుకునేందుకు నిశ్చయించుకున్న జూ యూ ఎయిర్‌బస్‌ నిర్మాణాన్ని ఆషామాషీగా తీసుకోలేదు. తన కలల సౌధాన్ని నిర్మించేందుకు నిజమైన ఎయిర్‌బస్‌ 320 కొలతలు తెలుసుకున్నాడు. రెక్కలు, కాక్‌పిట్‌, ఇంజన్‌ సహా అన్ని భాగాలకు సంబంధించిన పక్కా సమాచారం సేకరించి మరీ నిజమైన విమానాన్ని తలపించేలా ఈ కట్టడాన్ని నిర్మించాడు. ఇందుకోసం సుమారు 60 టన్నుల ఉక్కును వినియోగించాడు. ‘మధ్యతరగతి జీవిగా ఓ విమానాన్ని కొనడం నాకు సాధ్యమయ్యే పనికాదు. అందుకే కొనలేకపోయినా ఇలా విమానాన్ని నిర్మించి నా కోరిక నెరవేర్చుకున్నాను’ అంటూ జూ యూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం 156 సీట్లు ఉన్న ఈ విమానంలో 36 సీట్లను ఫస్ట్‌క్లాస్‌ సీట్లుగా మార్చినట్లు పేర్కొన్నాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top