3 వేల కి.మీ. నుంచే సర్జరీ | China1st remote surgery on a human using 5G technology | Sakshi
Sakshi News home page

3 వేల కి.మీ. నుంచే సర్జరీ

Mar 20 2019 1:57 AM | Updated on Mar 20 2019 5:07 AM

China1st remote surgery on a human using 5G technology - Sakshi

బీజింగ్‌: చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి.. ఓ రోగికి మెదడు సంబంధిత శస్త్రచికిత్స జరుగుతోంది. మూడు గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్స సక్సెస్‌ అయ్యింది. అయితే ఆపరేషన్‌ థియేటర్‌కు డాక్టర్‌ రాలేదు. పేషెంట్‌కు దూరంగా దాదాపు 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ హైనన్‌ ద్వీపంలో ఉన్నాడు. అక్కడి నుంచి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశాడన్న మాట..! అంత దూరం నుంచి ఆపరేషన్‌ ఎలా చేస్తాడని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగానే జరిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా 5జీ టెక్నాలజీని వినియోగించుకుని లింగ్‌ జీపీ అనే డాక్టర్‌ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రోగి మెదడులోకి న్యూరోస్టిమ్యులేటర్‌/ బ్రెయిన్‌ పేస్‌మేకర్‌ను ఎక్కించాడు. అంతేకాదు ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న అన్ని పరికరాలను అక్కడి నుంచే ఆపరేట్‌ చేశాడు. పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్‌ ఆస్పత్రిలో చేరాడు.

చైనాకు చెందిన హవాయీ మొబైల్‌ కంపెనీ రూపొందించిన 5జీ టెక్నాలజీకి అనుసంధానం చేసిన కంప్యూటర్‌ ద్వారా డాక్టర్‌ శస్త్రచికిత్స నిర్వహించారు. ఎదురెదురుగా ఉన్నప్పుడు వ్యక్తుల మధ్య సమాచారం ఎంత సమయంలో చేరుతుందో.. ఈ టెక్నాలజీతో ఎంత దూరంలో ఉన్నా కూడా అంతే సమయంలో చేరుతుందన్న మాట. కనీసం మిల్లీ సెకను వ్యత్యాసం కూడా అస్సలు ఉండదు. ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ సాంకేతికతతో వీడియో కాల్‌ చేసినప్పుడు అవతలి వైపు ఉన్న వారి మాటలు, వీడియో ఇవతలి వైపు ఉన్న వారిని చేరేందుకు కాస్త ఆలస్యం అవుతుంది. అందుకే 4జీని శస్త్రచికిత్సలకు వాడటం కుదరదు. కాగా, శస్త్రచికిత్స చేస్తున్నంత సేపు రోగి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఒక్కసారి కూడా అనిపించలేదని డాక్టర్‌ లింగ్‌ పేర్కొన్నారు. రోబోల ద్వారా జరుపుతున్న టెలీ సర్జరీ సాంకేతికత ద్వారా పలు సమస్యలు ఉన్నాయని, వాణిజ్యపరంగా ఆస్పత్రుల్లో వినియోగించేందుకు కాస్త సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement