చైనాకు అర్ధరాత్రి పాక్‌ మంత్రి ఫోన్‌కాల్‌.. స్ట్రాంగ్‌ మెసేజ్‌!

China Strong Message to Pakistan - Sakshi

బీజింగ్‌: దాయాది దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ బుధవారం అర్ధరాత్రి అత్యవసరంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ హికు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్‌కు చైనా విదేశాంగ మంత్రి గట్టి సందేశం ఇచ్చారు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను తప్పకుండా గౌరవించాలని పాక్‌కు హితవు పలికారు. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనను చైనా హర్షించబోదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ బుధవారం భారత గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించి దుందుడుకు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక పోస్టులు లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్రయత్నించి పాక్‌ విఫలమైందని భారత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ ఎఫ్‌-16 విమానాన్ని భారత్‌ కూల్చివేయగా.. భారత్‌కు చెందిన మిగ్‌ 21 బిసన్‌ విమానం పాక్‌లో కూలిపోయింది. ఈ విమానం నడుపుతున్న పైలట్‌ పాక్‌ సైన్యానికి బందీగా చిక్కాడు.

ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి అత్యవసరంగా పాక్‌ విదేశాంగ మంత్రి వాంగ్‌ హికి ఫోన్‌ చేశారని, అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనలను చైనా హర్షించబోదని హి ఆయనతో పేర్కొన్నారని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ చైనా పర్యటనను ముగించుకొని భారత్‌కు బయలుదేరిన తర్వాత పాక్‌ నుంచి చైనాకు ఫోన్‌కాల్‌ వెళ్లడం గమనార్హం. సుష్మా చైనా పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదం విషయంలో పాక్‌ ధోరణిని తప్పుబడుతూ భారత్‌, చైనా, రష్యా ఉమ్మడి ప్రకటనను విడుదల చేసి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top