చైనాలో కరోనా కల్లోలం | China confirms 880 coronavirus cases with 26 deaths | Sakshi
Sakshi News home page

చైనాలో కరోనా కల్లోలం

Jan 25 2020 3:58 AM | Updated on Jan 25 2020 8:02 AM

China confirms 880 coronavirus cases with 26 deaths - Sakshi

బీజింగ్‌/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ సోకి మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. తాజాగా మరో 880 మంది ఈ వైరస్‌తో న్యుమోనియా బారినపడ్డారు. చైనాలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ ఈ వ్యాధి రేపుతున్న కల్లోలం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసాధారణ రీతిలో కొత్త సంవత్సరం వేడుకల్ని చైనా సర్కార్‌ రద్దు చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ వైరస్‌ భారత్‌నూ భయపెడుతోంది.  

13 నగరాలకు రాకపోకలు బంద్‌  
కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం 13 నగరాల్లో రవాణా ఆంక్షలు విధించింది. మొట్టమొదటి సారి ఈ వైరస్‌ కనిపించిన సెంట్రల్‌ హుబీ ప్రావిన్స్‌లో 13 నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకల్ని నిలిపివేసింది. బస్సులు, రైళ్లను రద్దు చేసింది. దీంతో 4.1 కోట్ల మందిపై ప్రభావం చూపించింది. హుబీ ప్రావిన్స్‌లో హువాన్, దాని చుట్టుపక్కల ఉన్న 13 నగరాల నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పట్టణాల్లో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దంటూ ఉత్తర్వులిచ్చారు.

కొత్త సంవత్సర వేడుకలకి దూరం  
చైనాలో శనివారం కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. ఏటా వసంత రుతువుకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. కానీ, కరోనా వైరస్‌ కారణంగా ప్రజలెవరూ ఈ వేడుకల్ని జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాల్ని రద్దు చేసింది.  

గణతంత్ర వేడుకలు కూడా రద్దు  
ఈ నేపథ్యంలో చైనాలో భారత రాయబార కార్యాలయం గణతంత్ర వేడుకల్ని రద్దు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటం, సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషే«ధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  

ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు  
కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానం కలిగిన వారికి వైద్యపరీక్షలు, చికిత్సల కోసం రాజధాని ఢిల్లీలో ఆల్‌ ఇండియా మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎయిమ్స్‌) ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది

ముంబైలో ఇద్దరికి వైద్య పరీక్షలు  
ముంబై, సాక్షి: చైనా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు జలుబు, దగ్గు ఉండటంతో ముందు జాగ్రత్తగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 నుంచే ముంబై విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. అలాగే, చైనాకు వెళ్లి వచ్చిన 80 మందిని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో ఏడుగురికి దగ్గు, జ్వరం, గొంతువాపు ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.

ఎక్కడ నుంచి?: ఈ వైరస్‌ ఎక్కడ నుంచి మనుషులకు వ్యాపించిందో చైనా ఆరోగ్య అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. అయితే సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ నుంచి వ్యాపించినట్లు భావిస్తున్నారు. వుహాన్‌లోని ఈ మార్కెట్‌లో చట్టవిరుద్ధంగా పలు అడవి జంతువులను కూడా అమ్ముతుంటారు. క్రెయిట్‌ పాములు, నాగు పాములు, గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ వ్యాప్తిచెందుతున్నట్లు చైనా శాస్త్రవేత్తల అభిప్రాయం.  

10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం!
వైరస్‌ సోకిన వారికి చికిత్సచేసేందుకు ప్రత్యేకంగా ఫీల్డ్‌ ఆస్పత్రిని వుహాన్‌లో చైనా  నిర్మిస్తోంది. కేవలం 10 రోజుల్లో  ప్రీ ఫాబ్రికేటెడ్‌ విధానంలో దీని నిర్మాణం పూర్తయ్యేలా నిరంతరాయంగా పనులు చేయిస్తున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,000 పడకలు కలిగిన ఆస్పత్రిని నిర్మించనున్నారు.  కాగా, అమెరికాలో రెండో కరోనా వైరస్‌ కేసు నమోదైంది. చికాగోకు చెందిన 60 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ణయించారు. గత డిసెంబరులో ఈమె వుహాన్‌ను పర్యటించినట్లు తెలిపారు. మరో 50 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.   

లక్షణాలు
 తీవ్రమైన జ్వరం
దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 
న్యుమోనియాతో ఊపిరితిత్తుల్లో సమస్యలు 
కిడ్నీలు విఫలం కావడం
మాస్క్‌లు ధరించడం


జాగ్రత్తలు
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం
అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం
మాంసాహారం మానేయడం లేదా బాగా ఉడికించి తినడం
మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం
గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం
కాళ్లు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం
ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం
ఉతికిన దుస్తులు ధరించడం
వైరస్‌ సోకిన వారికి దూరంగా ఉండటం
దగ్గు, తుమ్ములు వచ్చినపుడు రుమాలు ఉపయోగించడం
వన్యప్రాణులకు దూరంగా ఉండటం


వుహాన్‌లో నిర్మించనున్న ఆస్పత్రి కోసం యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement