అమెరికా బాటలో ఆస్ట్రేలియా 

Australian 457 Sponsorship Visa To Be Cancelled - Sakshi

457 వీసా రద్దు.. అమల్లోకి వచ్చిన టీఎస్‌ఎస్‌ అనే కొత్త విధానం 

భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌ : ఇప్పుడు ఏ దేశాన్ని చూసినా మా ఉద్యోగాలు మాకే అని నినదిస్తున్నాయి. అమెరికా ఫస్ట్‌ అంటూ అగ్రరాజ్యం హెచ్‌ 1 బీ వీసాలపై ఎప్పుడైతే కఠిన వైఖరి అవలంబించడం మొదలు పెట్టిందో మిగిలిన దేశాలు కూడా అదే బాట పట్టాయి. ఆస్ట్రేలియా కూడా తమ దేశ పౌరులకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా గత ఏడాది నుంచే చర్యలు మొదలు పెట్టింది. విదేశీ ఐటీ నిపుణులకు తమ దేశంలో ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఉద్దేశించిన 457 వీసాని ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో టెంపరరీ స్కిల్‌ షార్టేజ్‌ (టీఎస్‌ఎస్‌) అనే కొత్త విధానాన్ని తీసుకు వచ్చింది. మార్చి 18 నుంచి ఈ కొత్త వీసా విధానం అమల్లోకి వచ్చింది.

457 వీసాను రద్దు చేస్తామని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్‌   గత ఏడాదే ప్రకటించారు. అప్పట్నుంచి  వీసా విధానంలో సమూలమైన మార్పులకు భారీగా కసరత్తు చేసి కొత్త విధానానికి రూపకల్పన చేశారు. ఈ పరిణామం భారత్‌ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి ఆశలు అడియాసలుగా మారాయి.  రద్దు చేసిన 457 వీసా ఇన్నాళ్లూ భారతీయులకు ఒక వరంలా ఉండేది. నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో అర్హులైన ఆస్ట్రేలియన్లు లేకపోతే వివిధ కంపెనీలు  విదేశీ నిపుణుల్ని నాలుగేళ్ల పాటు నియమించుకొనే అవకాశం  457 వీసా కల్పించింది. దీంతో చాలా మంది ఇండియన్‌ టెక్కీలు ఆస్ట్రేలియా బాటపట్టారు. ఆస్ట్రేలియాలో 2017 చివరి నాటికి  ఈ వీసా కింద 90,033 మంది ఉంటే వారిలో అత్యధికులు భారతీయులే. 

457 వీసా కేటగిరీ
మొత్తం వీసా ఉన్నవాళ్లు – 99,033
భారతీయులు – 19,400 (21.6%)
బ్రిటీషియన్లు – 16,800 (18.7%)
అమెరికన్లు –     5,100 (5.7%)

ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఇక కష్టమే
కొత్తగా తీసుకువచ్చిన టెంపరరీ స్కిల్‌ షార్టేజ్‌ (టీఎస్‌ఎస్‌) వీసా విధానం వల్ల ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం అంత సులభం కాదు. భారత్‌ నుంచి వెళ్లాలనుకునే వారికి, ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లోనే చదువుకున్న విద్యార్థులకు ఇక ఉద్యోగం రావడమే గగనంగా మారనుంది. రెండేళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభవం, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలగడం, నేరచరిత్ర లేకుండా ఉండడం వంటి నిబంధనలున్నాయి.

ఈ వీసా విధానంలో షార్ట్‌ టెర్మ్, మీడియం–లాంగ్‌ టెర్మ్‌ అని  రెండు రకాలు ఉన్నాయి. షార్ట్‌ టెర్మ్‌ విధానంలో తాత్కాలిక పద్ధతిలో రెండేళ్లకు మాత్రమే ఈ వీసా జారీ చేస్తారు. ఇక మీడియం –లాంగ్‌ టెర్మ్‌ విధానంలో నాలుగేళ్ల వరకు వీసా ఇస్తారు. టీఎస్‌ఎస్‌లో షార్ట్‌ టెర్మ్‌ వీసా ఉన్నవాళ్లు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి అనర్హులని ఆస్ట్రేలియా వీసా సొల్యూషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాన్‌ ఏంజెల్స్‌ చెప్పారు.

ఇక లాంగ్‌ టెర్మ్‌ వీసా ఉన్నవాళ్లు మూడేళ్ల పాటు ఉన్న తర్వాతే శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మీడియం–లాంగ్‌ వీసాల జాబితాలోకి వస్తారు. సాఫ్ట్‌వేర్‌ టెస్టర్లు, హార్డ్‌వేర్‌ టెక్నీషియన్లకు షార్ట్‌ టెర్మ్‌ వీసా మాత్రమే మంజూరు అవుతుంది. అంటే వారు ఆస్ట్రేలియాలో శాశ్వతంగా ఉండడానికి కుదరదు.

కంపెనీలపై ఆదనపు ఆర్థిక భారం
కొత్త వీసా విధానంతో నిపుణులైన విదేశీయులకు అవకాశాలు ఉన్నప్పటికీ వారిని తీసుకోవాలనుకునే కంపెనీలకు ఆర్థిక భారమే. ఎందుకంటే విదేశీయుల్ని స్పాన్సర్‌ చేసే కంపెనీ యాజమాన్యాలు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్లింగ్‌ ఫండ్‌కు తప్పనిసరిగా నిధులు ఇవ్వాలి. ఆస్ట్రేలియన్లలో నైపుణ్యాన్ని పెంచడం కోసం ఉద్దేశించిన స్కిల్లింగ్‌ ఆస్ట్రేలియా ఫండ్‌ కి సంబంధించిన బిల్లుపై ఇప్పటికే పార్లమెంటులో చర్చ జరుగుతోంది. ఈ బిల్లు పాసైతే కంపెనీలు ఒక్కో విదేశీ ఉద్యోగి నామినేషన్‌పై 1200 డాలర్లు ఆ ఫండ్‌కి ఇవ్వాలి. అంటే దాదాపుగా ఒక్కో ఉద్యోగి నామినేషన్‌కే 60 వేల రూపాయలు ఖర్చు చేయాలన్న మాట. నాలుగేళ్ల పాటు ఒక విదేశీయుడికి ఉద్యోగం కల్పిస్తే  ప్రభుత్వానికి 2 లక్షల 40 వేల రూపాయల వరకు కంపెనీలు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో ఉద్యోగిపై అంత ఆర్థిక భారాన్ని కంపెనీలు ఎందుకు మోస్తాయనే చర్చ జరుగుతోంది.

వీసా దుర్వినియోగం?
457 వీసాని 1990లో ప్రవేశపెట్టారు. మొదట్లో బిజినెస్‌ ప్రొఫషనల్స్, అత్యంత నైపుణ్యం కలిగిన వారికే ఈ వీసా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేవారు. కానీరాను రాను అన్ని రంగాల్లో ఉద్యోగాలకు వీసాను వర్తింపచేశారు. దీంతో వివిధ దేశాల నుంచి ఉద్యోగం కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే ఈ వీసా దుర్వినియోగం అవుతోందని, తక్కువ వేతనాలకే వస్తారని నైపుణ్యం లేని వారికి కూడా ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల ఆస్ట్రేలియన్లకు ఉద్యోగ అవకాశాలు పోతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.  దీంతో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని, వారిలో వృత్తి నైపుణ్యాలను పెంచాలన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ఫస్ట్‌ అన్న నినాదాన్ని ప్రభుత్వం తీసుకువచ్చి సమూలంగా మార్పులు చేసింది. (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top