breaking news
Australia visa
-
ఆస్ట్రేలియాలో చదువు.. వీసాకు కొత్త రూల్
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. స్టూడెంట్ వీసా కావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు దేశం కనీస వేతనంలో కనీసం 75 శాతానికి సమానమైన నిధులను కలిగి ఉండాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధనను విధించింది.మే 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఆస్ట్రేలియాలో చదివేందుకు అర్హత సాధించడానికి, భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 29,710 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ. 16,29,964) తమ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ చూపించాలి.నాలుగు సార్లు పెంపుఇమిగ్రేషన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గడిచిన ఏడు నెలల్లో విద్యార్థుల పొదుపు సొమ్ముకు సంబంధించి వీసా నిబంధనలను నాలుగు సార్లు సవరించింది. గత సంవత్సరం అక్టోబర్ నాటికి, విద్యార్థి వీసాల కోసం చూపించాల్సిన మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండేది.ఈ ఏడాది మార్చిలో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని పెంచింది. కోవిడ్ పరిమితుల అనంతరం ఆస్ట్రేలియాకు విద్యార్థుల రాక పెరిగింది. దీంతో వసతికి సైతం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీసా చట్టాల అమలును కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
షాకింగ్.. అన్నాచెల్లెల పెళ్లి!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పచుకునేందుకు అన్నాచెల్లెలు ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్యాభర్తలుగా చెలామణి అవుతున్న వీరి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇదంతా చేశారని వీరి బంధువు ఒకామె పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడిందని ఆస్ట్రేలియా వార్తా సంస్థ ఎస్బీఎస్ డాట్‌కామ్ వెల్లడించింది. ఫిర్యాదు ఆధారంగా బథిండా జిల్లాలోని బాలియన్‌వాలా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరితో పాటు వారి ఆరుగురు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ పేర్కొన్నట్టు బాలియన్‌వాలా ఎస్ఐ జైసింగ్ తెలిపారు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఉంటున్న నిందితుడు తన సోదరిని కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు ఈ నాటకం ఆడాడు. ముందుగా తన సమీప బంధువు పేరుతో నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటితో గరుద్వారా నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకుని, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించారని జైసింగ్ వివరించారు. 2012లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ ఆస్ట్రేలియాలోనే ఉన్నారని, తాము దర్యాప్తు పూర్తి చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ కేసు తమను షాక్‌కు గురి చేసిందని పోలీసులు తెలిపారు. వీసా కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతుండడం తాము చూశామని, అన్నాచెల్లెలు పెళ్లి చేసుకున్నట్టుగా నటించడం ఇప్పటివరకు చూడలేదని ఆశ్చర్యపోయారు. నకిలీ పెళ్లి పత్రాలతో తమ దేశానికి రావాలని చూస్తే కఠిన దండన తప్పదని భారతీయులకు గతేడాది ఆస్త్రేలియా హెచ్చరిక జారీ చేసింది. 32 ఏళ్ల భారతీయుడొకరు నిరుడు నవంబర్‌లో నకిలీ వివాహ పత్రాలతో దొరికిపోవడంతో ఈమేరకు వార్నింగ్ ఇచ్చింది. ఫోర్జరీ సర్టిఫికెట్లు సమర్పించారన్న కారణంతో 164 మందికి భాగస్వామ్య వీసాలు నిరాకరించినట్టు ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ తెలిపింది. -
అమెరికా బాటలో ఆస్ట్రేలియా
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు ఏ దేశాన్ని చూసినా మా ఉద్యోగాలు మాకే అని నినదిస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అంటూ అగ్రరాజ్యం హెచ్ 1 బీ వీసాలపై ఎప్పుడైతే కఠిన వైఖరి అవలంబించడం మొదలు పెట్టిందో మిగిలిన దేశాలు కూడా అదే బాట పట్టాయి. ఆస్ట్రేలియా కూడా తమ దేశ పౌరులకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా గత ఏడాది నుంచే చర్యలు మొదలు పెట్టింది. విదేశీ ఐటీ నిపుణులకు తమ దేశంలో ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఉద్దేశించిన 457 వీసాని ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో టెంపరరీ స్కిల్ షార్టేజ్ (టీఎస్ఎస్) అనే కొత్త విధానాన్ని తీసుకు వచ్చింది. మార్చి 18 నుంచి ఈ కొత్త వీసా విధానం అమల్లోకి వచ్చింది. 457 వీసాను రద్దు చేస్తామని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ గత ఏడాదే ప్రకటించారు. అప్పట్నుంచి వీసా విధానంలో సమూలమైన మార్పులకు భారీగా కసరత్తు చేసి కొత్త విధానానికి రూపకల్పన చేశారు. ఈ పరిణామం భారత్ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి ఆశలు అడియాసలుగా మారాయి. రద్దు చేసిన 457 వీసా ఇన్నాళ్లూ భారతీయులకు ఒక వరంలా ఉండేది. నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో అర్హులైన ఆస్ట్రేలియన్లు లేకపోతే వివిధ కంపెనీలు విదేశీ నిపుణుల్ని నాలుగేళ్ల పాటు నియమించుకొనే అవకాశం 457 వీసా కల్పించింది. దీంతో చాలా మంది ఇండియన్ టెక్కీలు ఆస్ట్రేలియా బాటపట్టారు. ఆస్ట్రేలియాలో 2017 చివరి నాటికి ఈ వీసా కింద 90,033 మంది ఉంటే వారిలో అత్యధికులు భారతీయులే. 457 వీసా కేటగిరీ మొత్తం వీసా ఉన్నవాళ్లు – 99,033 భారతీయులు – 19,400 (21.6%) బ్రిటీషియన్లు – 16,800 (18.7%) అమెరికన్లు – 5,100 (5.7%) ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఇక కష్టమే కొత్తగా తీసుకువచ్చిన టెంపరరీ స్కిల్ షార్టేజ్ (టీఎస్ఎస్) వీసా విధానం వల్ల ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం అంత సులభం కాదు. భారత్ నుంచి వెళ్లాలనుకునే వారికి, ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లోనే చదువుకున్న విద్యార్థులకు ఇక ఉద్యోగం రావడమే గగనంగా మారనుంది. రెండేళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభవం, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలగడం, నేరచరిత్ర లేకుండా ఉండడం వంటి నిబంధనలున్నాయి. ఈ వీసా విధానంలో షార్ట్ టెర్మ్, మీడియం–లాంగ్ టెర్మ్ అని రెండు రకాలు ఉన్నాయి. షార్ట్ టెర్మ్ విధానంలో తాత్కాలిక పద్ధతిలో రెండేళ్లకు మాత్రమే ఈ వీసా జారీ చేస్తారు. ఇక మీడియం –లాంగ్ టెర్మ్ విధానంలో నాలుగేళ్ల వరకు వీసా ఇస్తారు. టీఎస్ఎస్లో షార్ట్ టెర్మ్ వీసా ఉన్నవాళ్లు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి అనర్హులని ఆస్ట్రేలియా వీసా సొల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాన్ ఏంజెల్స్ చెప్పారు. ఇక లాంగ్ టెర్మ్ వీసా ఉన్నవాళ్లు మూడేళ్ల పాటు ఉన్న తర్వాతే శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ నెట్వర్క్ సిస్టమ్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీడియం–లాంగ్ వీసాల జాబితాలోకి వస్తారు. సాఫ్ట్వేర్ టెస్టర్లు, హార్డ్‌వేర్ టెక్నీషియన్లకు షార్ట్ టెర్మ్ వీసా మాత్రమే మంజూరు అవుతుంది. అంటే వారు ఆస్ట్రేలియాలో శాశ్వతంగా ఉండడానికి కుదరదు. కంపెనీలపై ఆదనపు ఆర్థిక భారం కొత్త వీసా విధానంతో నిపుణులైన విదేశీయులకు అవకాశాలు ఉన్నప్పటికీ వారిని తీసుకోవాలనుకునే కంపెనీలకు ఆర్థిక భారమే. ఎందుకంటే విదేశీయుల్ని స్పాన్సర్ చేసే కంపెనీ యాజమాన్యాలు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్లింగ్ ఫండ్‌కు తప్పనిసరిగా నిధులు ఇవ్వాలి. ఆస్ట్రేలియన్లలో నైపుణ్యాన్ని పెంచడం కోసం ఉద్దేశించిన స్కిల్లింగ్ ఆస్ట్రేలియా ఫండ్ కి సంబంధించిన బిల్లుపై ఇప్పటికే పార్లమెంటులో చర్చ జరుగుతోంది. ఈ బిల్లు పాసైతే కంపెనీలు ఒక్కో విదేశీ ఉద్యోగి నామినేషన్‌పై 1200 డాలర్లు ఆ ఫండ్‌కి ఇవ్వాలి. అంటే దాదాపుగా ఒక్కో ఉద్యోగి నామినేషన్‌కే 60 వేల రూపాయలు ఖర్చు చేయాలన్న మాట. నాలుగేళ్ల పాటు ఒక విదేశీయుడికి ఉద్యోగం కల్పిస్తే ప్రభుత్వానికి 2 లక్షల 40 వేల రూపాయల వరకు కంపెనీలు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో ఉద్యోగిపై అంత ఆర్థిక భారాన్ని కంపెనీలు ఎందుకు మోస్తాయనే చర్చ జరుగుతోంది. వీసా దుర్వినియోగం? 457 వీసాని 1990లో ప్రవేశపెట్టారు. మొదట్లో బిజినెస్ ప్రొఫషనల్స్, అత్యంత నైపుణ్యం కలిగిన వారికే ఈ వీసా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేవారు. కానీరాను రాను అన్ని రంగాల్లో ఉద్యోగాలకు వీసాను వర్తింపచేశారు. దీంతో వివిధ దేశాల నుంచి ఉద్యోగం కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే ఈ వీసా దుర్వినియోగం అవుతోందని, తక్కువ వేతనాలకే వస్తారని నైపుణ్యం లేని వారికి కూడా ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల ఆస్ట్రేలియన్లకు ఉద్యోగ అవకాశాలు పోతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని, వారిలో వృత్తి నైపుణ్యాలను పెంచాలన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ఫస్ట్ అన్న నినాదాన్ని ప్రభుత్వం తీసుకువచ్చి సమూలంగా మార్పులు చేసింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆన్లైన్లో ఆస్ట్రేలియా వీసా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యాటక వీసా కోసం భారతీయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ దేశ హైకమిషనర్ తెలిపారు. అర్హులైన భారతీయులు తమ విభాగం ‘ఇమ్మి అకౌంట్ పోర్టల్’ ద్వారా జూలై 1 నుంచి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆస్ట్రేలియా తాత్కాలిక హైకమిషనర్ క్రిస్ ఎల్స్టోఫ్ట్ పేర్కొన్నారు. దీని ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటిం చాలనుకునే భారతీయులకు వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు. దరఖాస్తుదారుడి అంగీకారంతో అతడి కుటుంబ సభ్యులు, ట్రావెల్ ఏజెంట్, వీసా అప్లికేషన్, కేంద్రం ఇలా థర్డ్ పార్టీకి చెందిన వారెవరైనా దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయొచ్చని ఆయన వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు, అనుబంధ పత్రాలు ప్రాసెసింగ్ కార్యాలయానికి అందుబాటులో రావడం వల్ల ఇలాంటి వీసాలకు ప్రాసెసింగ్ సమయం చాలా తక్కువ అవుతుందన్నారు. భారత్‌లో ఆస్ట్రేలియా వీసాలకు ఆదరణ పెరుగుతోందని, గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి మధ్యలో సుమారు రెండున్నర లక్షల మంది భారతీయులు ఆస్ట్రేలియాలో పర్యటించారని తెలిపారు.