భూమిని ఢీ కొనేందుకు గ్రహశకలాలు రెఢీ..?

Asteroids May Hit Earth This Century - Sakshi

సాక్షి : హాలివుడ్‌ సినిమాలో చూపినట్లుగా మనం ముందే మేల్కొనకపోతే గ్రహశకలాలతో భూమికి ప్రమాదం రాబోతోందా? మొత్తం మానవ సమాజం తుడిచిపెట్టుకుపోయేంత విపత్తు మనకు ఈ గ్రహశకలాలతో ఎదురుకానుందా?.. అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మొత్తం నాలుగు గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోకపోయినా గ్రహశకలాల వల్ల విపత్తు తలెత్తే అవకాశం ఉండటంతో జూన్‌ 30ని అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా  ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జూన్‌ 30నే ఎంచుకోవడానికి కారణం ఈ రోజే అతిపెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టింది కనుక. 1908 సంవత్సరం రష్యాలోని టుంగ్సుకా ప్రాంతంలో వేల ఎకరాల అడవిని నాశనం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రస్తుతానికి భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న ఈ నాలుగు గ్రహశకలాలకు 1979XB, అపోఫిస్‌, 2010RF12, 2000SG344 అని పేరు పెట్టారు.

1979xb గ్రహశకలం
900 మీటర్ల వ్యాసం గల ఈ గ్రహ శకలం మన భూగ్రహాన్ని ఢీకొడితే వినాశనమేనని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది గంటకు 70,000కిమి వేగంతో సౌర వ్యవస్థలో ప్రయాణిస్తుంటుంది. ప్రతి సెకనుకు 30 కిలోమీటర్లు భూమికి దగ్గరవుతూ భయపెడుతోంది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ భూమికి ప్రమాదం తెచ్చే గ్రహశకలాల జాబితాలో దీనికి రెండవ స్థానం ఇచ్చింది. ఈ శతాబ్ధం మధ్యలో ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినా, ఖగోళ నిపుణులు మాత్రం ఇది 2024లోపే భూవాతావరణంలోకి ప్రవేశించొచ్చని అనుమానిస్తున్నారు.

అపోఫిస్‌
నాలుగు ఫుట్‌బాల్‌ మైదానాల పరిమాణం ఉన్న ఇది భూ కక్ష్యకు చాలా దగ్గరలో ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రస్తుతం భూమికి 200 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ సెకన్‌కు 0.5 కిలోమీటర్ల చొప్పున భూమి దిశగా వస్తోంది. ఈ గ్రహ శకలం క్రమం తప్పకుండా భూ కక్ష్యలో వెళ్తుంది. తాజా రాడార్‌ సిగ్నల్‌ ప్రకారం ప్రకారం ఇది 2029లో  భూమికి కేవలం 30,000 కి.మి చేరువకు వస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌ మధ్యలో మన భూ కక్ష్య మీదుగా వెళ్తుంది. ఇక్కడ సంతోషకర విషయం ఏమంటే ఈసారి భూమికి 30 మిలియన్‌ కి.మి దూరంలో వెళ్లడం. ఇది గానీ భూమిని ఢీకొడితే 15,000 అణుబాంబుల శక్తి ఉత్పన్నం అవుతుంది.

2010 RF12
ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని సందేహాస్పద గ్రహశకలం ఇది. ఎర్త్‌ ఇంపాక్ట్‌ మానిటరింగ్‌ మరియు ఈఎస్‌ఏలు రెండింటిలోనూ దీన్ని ప్రమాదకర గ్రహశకలంగా నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం భూమికి 215 మిలియన్‌ కి.మి దూరంలో గంటకు 1,17,935 కి.మి వేగంతో ప్రయాణిస్తోంది. దీంతో ప్రమాదాన్ని ఈ శతాబ్దం చివరి వరకూ అంచనా వేయకపోయినా 500 టన్నుల బరువు, 7 మీటర్ల వ్యాసం గల ఇది భూమిని ఢీకొడితే 2013లో రష్యా పట్టణం చెల్యాబిస్క్‌పై ఉల్కపాతం పడినప్పుడు జరిగిన నష్టం కన్నా ఎక్కువే ఉంటుంది. అనుకోకుండా ఒక ఉల్కపాతం ఈ రష్యా నగరంపై పడి వేలాది భవనాలు దెబ్బతినడమే గాక వందల మంది గాయాలు పాలయ్యారు. 2010RF12 ఆగస్టు 13 2022లో భూమికి దగ్గరగా ప్రయాణిస్తుందని, అప్పుడు దీని భవిష్యత్‌ గమనాన్ని అంచనా వేయడానికి వీలుంటందని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

2000 Sg344
50 మీటర్ల వ్యాసం కలిగినా చాలా తక్కువ పరిమాణం ఉండటంతో ఇది కలిగించే ప్రమాదం కొంచెం తక్కువే. రష్యా పట్టణానికి కలిగిన నష్టంతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇది భూమికి ప్రతి సెకనుకు 1.3 కి.మి చేరువ అవుతోంది. 2000 SG344 అనేది అటెన్ ఆస్టరాయిడ్స్ అని పిలువబడే ఒక సమూహంలో భాగం. ఈ సమూహంలోని గ్రహశకలాల కక్ష్యలు భూమి కక్ష్యకు చాలా దగ్గరగా ఉంటాయి. రాబోయే మూడు లేదా నాలుగు దశాబ్దాల్లో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా.

ఇంకా గుర్తించనివి..
మనకు ఇంకా తెలియని గ్రహశకలాలు చాలా ఉన్నాయి. ఇవి మనం గుర్తించక ముందే ఏ సెకను అయినా భూ వాతావరణంలోకి ప్రవేశించవచ్చు. మన సాంకేతికత ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఉదాహరణకు రష్యా మీదకు వచ్చిన ఉల్కపాతాన్నిఅంచనా వేయలేకపోయాం. ఇది జపాన్‌పై 1945లో వేసిన అణుబాంబు కన్నా30 రెట్లు శక్తివంతమైంది. అలాగే డిసెంబరులో బేరింగ్‌ సముద్రంలో ఒక గ్రహశకలం పడింది. ఇది సముద్రంలో అణుబాంబు కన్నా10 రెట్లు శక్తివంతమైన అలజడిని రేపింది. గ్రహశకలాలతో మనకు ఏర్పడబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఐక్యరాజ్యసమితి గ్రహశకలాల ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అవగాహన కల్పించడానికే జూన్‌ 30ని అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా ప్రకటించింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top