థాయ్‌లాండ్‌లో సైనిక కుట్ర | As it happened: Thailand coup | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో సైనిక కుట్ర

May 23 2014 1:10 AM | Updated on Sep 2 2017 7:42 AM

థాయ్‌లాండ్‌లో సైనిక కుట్ర

థాయ్‌లాండ్‌లో సైనిక కుట్ర

ఇప్పటికే ఎన్నో సైనిక కుట్రలు చవిచూసిన థాయ్‌లాండ్‌లో మళ్లీ సైన్యం తిరుగుబాటు చేసింది.

సైన్యం చేతుల్లోకి అధికారం.. రాజ్యాంగం రద్దు..
- దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ
- టీవీలు, రేడియోల్లో ప్రసారాలపై నిషేధం

 
బ్యాంకాక్: ఇప్పటికే ఎన్నో సైనిక కుట్రలు చవిచూసిన థాయ్‌లాండ్‌లో మళ్లీ సైన్యం తిరుగుబాటు చేసింది. మంగళవారం దేశంలో మార్షల్ లా(సైనిక చట్టం) విధిస్తున్నామని, అయితే ఇది సైనిక కుట్ర కాదని ప్రకటించిన సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రయూత్ చాన్‌వోచా గురువారం హఠాత్తుగా దేశాధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అలాగే అన్ని టెలివిజన్, రేడియో చానెళ్లలో ప్రసారమయ్యే రోజువారీ కార్యక్రమాలను రద్దు చేసి, వాటి స్థానంలో సైనిక ప్రకటనలను, దేశభక్తి గీతాలను మాత్రమే ప్రసారం చేయాలని ఆదేశించారు.

దేశంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగులు యథావిధిగా తమ ఉద్యోగాలు చేసుకోవచ్చని తెలిపారు. కొన్ని నెలలుగా థాయ్‌లాండ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రయూత్ చాన్‌వోచా టీవీ చానళ్లలో మాట్లాడుతూ..‘‘థాయ్ సైన్యం, రాయల్ ఎయిర్‌ఫోర్స్, పోలీసులతో కూడిన జాతీయ శాంతి పరిరక్షణ కమిటీ.. దేశంలో సంక్షోభం తీవ్రం కాకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది’’ అని తెలిపారు.

రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా నిషేధం విధిస్తున్నామన్నారు. వీధుల్లో నిరసనలకు దిగుతున్నవారు వెంటనే తమ ఇళ్లకు వెళ్లాలని, ఈ మేరకు బస్సులు ఏర్పాటు చేశామని సూచించారు. రద్దయిన ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రులు గురువారం సాయంత్రానికల్లా సైన్యం ముందు హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటిదాకా థాయ్‌లాండ్‌లో 18 సార్లు సైన్యం తిరుగుబాటు చేయగా.. వాటిలో 11 విజయవంతమయ్యాయి. మరోవైపు దేశంలో సైనిక కుట్ర నేపథ్యంలో భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. కర్ఫ్యూ సమయంలో బయటకు రాకుండా ఉండటం ఉత్తమమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement