అమెరికా వలస జీవితంలో ఉద్విగ్నక్షణాలు

An American immigrant Jorge Garcia's emotional departure - Sakshi

డెట్రాయిట్‌ : దేశాల మధ్య గోడలు కడతానన్నాడు. అయితే ఆ గోడలు.. ప్రాంతాలనేకాదు మనుషుల్ని, వారి మధ్య పెనవేసుకున్న అనుబంధాల్ని కూడా విడదీస్తాయన్న సంగతి మర్చిపోయాడు. అవును. మనం మాట్లాడుతున్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించే. ఆయన ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో అమెరికాలో వసలదారులు ఎంతగా క్షోభపడుతున్నది ఈ ఒక్క కథనం చదివితే అవగతమవుతుంది..

ఆ వలసదారుడి పేరు జార్జి గార్సియా. వయసు 39. భార్యాపిల్లలతో డెట్రాయిట్‌(మిచిగాన్‌ రాష్ట్రం)లో ఆనందంగా గడిపేవాడు. ట్రంప్‌ వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి శాంతి కరువైంది.. ‘నువ్‌ పుట్టుకతో అమెరికన్‌వి కాదు కాబట్టి ఇక్కడినుంచి వెళ్లిపో’  అని అధికారులు జార్జిని ఆదేశించారు. తన భార్య జన్మతః అమెరికనే అని, ఇద్దరు పిల్లలున్నారని,  చాలా ఏళ్ల నుంచి పన్నులు కడుతూ అమెరికా చట్టాలను గౌరవిస్తున్నానని జార్జి ఎంత వాదించినా అధికారులు వినిపించుకోలేదు. కనీసం నూతన డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌వుడ్‌ ఆరైవల్స్‌ చట్టం(డీఏసీఏ) అమలులోకి వచ్చేంత వరకైనా ఆగమంటే ఆగలేదా అధికారులు!

తీవ్రమైన నిర్బంధం నడుమ జార్జి గార్సియా జనవరి 15న స్వదేశమైన మెక్సికోకు పయనమయ్యాడు. ఆ రోజు..నల్లజాతీయులు,వలసదారుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జయంతి కూడా! జార్జికి వీడ్కోలు చెప్పలేక, ఉండమనే అధికారంలేక.. ఎయిర్‌పోర్టులో ఆ కుటుంబం అనుభవించిన బాధ పలువురిని కంటతడిపెట్టించింది. జార్జి తన ఇద్దరు పిల్లలు, భార్యను గట్టిగా హత్తుకున్నాడు. ఇదే చివరిసారి అన్నట్లు వారి కళ్లలోకి చూశాడు. ‘పద పదా..’ అంటూ అధికారులు అతన్ని లోనికి తీసుకెళ్లారు. మాటరాని భాషలో భారంగా తన వారికి వీడ్కోలు ఇచ్చి అతను ముందుకు కదిలాడు... ట్రంప్‌ ఫర్మానా ప్రకారం మరో పది సంవత్సరాల దాకా జార్జి అమెరికాలో అడుగుపెట్టేవీలులేదు!

ట్రంప్‌ వలస నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎయిర్‌పోర్టులో నిరసనలు

జార్జి గార్సియా కుటుంబం(ఫైల్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top