‘ఇండియా’ భూమిని చైనాకు అమ్మేస్తున్న పాక్‌

‘ఇండియా’ భూమిని చైనాకు అమ్మేస్తున్న పాక్‌


న్యూఢిల్లీ: అనుకున్నదే అవుతుంది. చైనా సామ్రాజ్యవాద కాంక్షకు పాకిస్థాన్‌ దన్నుగా నిలుస్తోంది. 70 ఏళ్ల కిందట భారత్‌ నుంచి దొంగచాటుగా లాక్కున్న గిల్గిత్‌-బాల్తిస్థాన్‌లోని చాలా భాగాన్ని చైనాకు పాకిస్థాన్‌ విక్రయిస్తోంది. చైనా పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సీపీఈసీ‌) పేరిట ఈ భూమిని స్థానికులకు ఇష్టం లేకుండానే బలవంతంగా లాగేసుకొని చైనాకు కట్టబెడతోంది. చైనాలోని పలు కంపెనీలకు, రెడ్‌ ఆర్మీకి గిల్గిత్‌ బాల్తిస్థాన్‌ భూములను అక్రమంగా విక్రయిస్తున్నారంటూ అక్కడి వాళ్లంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలు, సేకరించిన సమాచారం ప్రకారం పాకిస్థాన్‌ జనరల్స్‌ బలవంతంగా దౌర్జన్యం చేసి ఆ భూమిని ఆక్రమిస్తున్నారంట.



భూములిచ్చేందుకు నిరాకరిస్తున్నవారిని అకారణంగా చంపివేయడంతోపాటు ఎలాంటి విచారణ లేకుండానే శిక్షలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఇప్పటికే వేలమంది తమ భూమిని కోల్పోయారు. పాక్‌ మిలిటరీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తమ ప్రాంతంలోకి వచ్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. అత్యంత నిరంకుశంగా జరుగుతున్న ఈ పరిపాలన గురించి ఏ ఒక్కరం కూడా నోరెత్తలేని పరిస్థితి ఉంది. సీపీఈసీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితాలు నాశనం చేస్తున్నారు’ అంటూ గిల్గిత్‌-బాల్తిస్థాన్‌ థింకర్స్‌ ఫోరం (జీబీటీఎఫ్‌) చైర్మన్‌ సదరు మీడియాకు చెప్పారు. పెద్ద కంటోన్మెంటులు ఏర్పాటుచేసి వాటిల్లో చైనా, పాక్‌ సైన్యాలు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారని కూడా ఆయన వివరించారు. పాక్‌ అక్రమిత కశ్మీర్‌ కంటే ఈ భూభాగం ఆరింతలు పెద్దదిగా ఉంటుంది. ఇది కూడా ఒకప్పుడు కశ్మీర్‌లో భాగంగా ఉండేది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top