జాగింగ్‌ చేస్తూ.. అనుకోకుండా ‘హద్దులు’ దాటింది!

19-year-old Girl Accidentally Crossed Into US From Canada - Sakshi

అందమైన సముద్రతీరం.. అక్కడక్కడ బీచ్‌లు.. సీఫుడ్‌ రెస్టారెంట్లు.. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం.. జాగింగ్‌ చేయాలనుకునేవారికి ఇంతకన్నా భూతలస్వర్గం ఇంకొటి ఉండదేమో.. హాయిగా జాగింగ్‌ చేస్తూ ముందుకు సాగిన 19 ఏళ్ల సెడెల్లా రోమన్‌ కూడా ఇలాగే భావించి ఉంటుంది. కెనడా బ్రిటిష్‌ కొలంబియాలోని వైట్‌రాక్‌ తీరం మీదుగా ఆమె జాగింగ్‌ చేసుకుంటూ దక్షిణ దిశగా సాగిపోయింది. అందమైన సెమియామూ తీరం అందాలను చూస్తూ.. నెమ్మదిగా పరిగెత్తుతూ వెళ్లిన ఆమె అనుకోకుండా సరిహద్దులు దాటి అమెరికాలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో తన వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో సెడెల్లా చిక్కుల్లో పడింది. అసలే కెనడా సరిహద్దుల నుంచి వచ్చే అక్రమ వలసదారులపై ట్రంప్‌ ఆదేశాల మేరకు అమెరికా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మామూలుగా అయితే.. హెచ్చరికలతో వదిలిపెట్టే అధికారులు.. గత నెల 21న అనుకోకుండా సరిహద్దులు దాటిన సెడెల్లాను కస్టడీలోకి తీసుకున్నారు. 22న ఆమెను అరెస్టు చేసి..  వాషింగ్టన్‌ టకోమాలోని నార్త్‌వెస్ట్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. దీంతో డిటెన్షన్‌ సెంటర్‌లో జూన్‌ 5 వరకు రెండువారాలపాటు ఆమె మగ్గాల్సి వచ్చింది.

ఫ్రాన్స్‌లో నివాసముండే సెడాల్లా రొమన్‌.. బ్రిటిష్‌ కొలంబియాలోని నార్త్‌ డెల్టాలో ఉండే తన తల్లిని చూడటానికి వచ్చింది. వైట్‌రాక్‌ తీరం వద్ద అందాలను వీక్షిస్తూ ఆమె అనుకోకుండా సరిహద్దులు దాటింది. ఇక్కడ నుంచి అమెరికా-కెనడా మధ్య సరిహద్దు మార్క్‌ మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.  అప్పుడప్పుడు పర్యాటకులు ఇక్కడ సరిహద్దులు దాటి అందాలు వీక్షించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మందలించి వదిలేస్తూ ఉంటారు. కానీ సెడెల్లా రుమన్‌ మాత్రం అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించిందని, ఆమె అక్రమ వలసదారు అంటూ అమెరికా అధికారులు నానా హంగామా చేసి.. ఆమెను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమెను విడుదల చేసిన అధికారులు తమ చర్యను సమర్థించుకునే కారణాలు చెప్తున్నారు.

సెడెల్లా రొమన్‌ (ఫేస్‌బుక్‌ ఫొటోలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top