వైరల్‌ : ఇంజిన్‌లో 12 అడుగుల కొండచిలువ

12 Foot Python Rescue From Car Engine In Thailand - Sakshi

బ్యాంకాక్‌ : ఇటీవల కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపైకే కాకుండా ఇండ్లలోకి, వాహనాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా థాయ్‌లాండ్‌లోని టీ నట్వజిట్‌ అనే షాప్‌ ఓనర్‌ కారులోకి 12 అడుగుల కొండ చిలువ దూరింది. కారు కింది భాగంలో కొండచిలువ తోక వేలాడుతుందని గమనించిన కొందరు అతనికి ఈ విషయం తెలియజేశారు. ఆందోళనకు గురైన నట్వజిట్‌ తన వాహనం ఇంజన్‌ డోర్‌ తెరచి చూసి షాక్‌ తిన్నాడు. అందులోని కొండచిలువను చూసి ఏం చేయాలో తెలీక వెంటనే ఇంజన్‌ డోర్‌ను మూసివేశాడు. ఈ సమాచారాన్ని వెంటనే పాములు పట్టే వారికి(రెస్క్యూ టీమ్‌) తెలియజేశాడు.

అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ సిబ్బంది నెమ్మదిగా కొండచిలువను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కాని అది ఇంజన్‌ చుట్టూ పెనవేసుకుని ఉండటంతో బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. చివరికి కొండచిలువను క్షేమంగా కారు నుంచి వెలుపలకు తీసి.. పొదల్లో విడిచిపెట్టారు. ఈ కొండచిలువ 12 అడుగుల పొడవు ఉండటంతో అది కారు ఇంజన్‌లో ఎలా పట్టిందని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నట్వజిట్‌ కారు నుంచి కొండచిలువను వెలుపలికి తీస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంత పొడవైన కొండచిలువ తన వాహనంలో ఉన్న గుర్తించలేకపోయానని నట్వజిట్‌ తెలిపాడు. ఈ ఘటన తనకొక పీడకలలాంటిది అని పేర్కొన్నాడు. రెస్క్యూ టీమ్‌ సభ్యుడు క్రిప్టల్‌ మాట్లాడుతూ.. కొండచిలువ 30 కేజీల బరువుందని.. దానిని సురక్షితంగా పొదల్లోకి విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు, వాతావరణ మార్పులు సంభవించినప్పుడు వెచ్చదనం కోసం కొండచిలువలు కార్ల ఇంజన్లలో దూరుతాయని తెలిపాడు. ప్రజలు తమ వాహనాలు నడిపేముందు ఒక్కసారి ఇంజన్‌ను తనిఖీ చేసుకోవాలని సూచించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top