ఖైదీలకు క్షమాభిక్ష ఈసారి లేనట్లే..! | This time, as there is Clemency for prisoners ..! | Sakshi
Sakshi News home page

ఖైదీలకు క్షమాభిక్ష ఈసారి లేనట్లే..!

Aug 7 2015 2:23 AM | Updated on Sep 3 2017 6:55 AM

జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే క్షమాభిక్ష ఈసారి కూడా లభించే అవకాశం లేదు.

* మరోసారి నిరాశకు గురైన ఖైదీలు
* ఆశలన్నీ గణతంత్ర దినోత్సవం పైనే

సాక్షి, హైదరాబాద్: జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే క్షమాభిక్ష ఈసారి కూడా లభించే అవకాశం లేదు. ఏళ్ల తరబడి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖైదీలు, వారి కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. ఖైదీలకు రాష్ట్రప్రభుత్వాలు కల్పించే క్షమాభిక్షపై కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుపై సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. క్షమాభిక్షపై నిషేధాన్ని తొలగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కొన్ని మార్గదర్శకాలను సూచించింది.

అయితే తీర్పునకు సంబంధించిన ప్రతులు ప్రభుత్వానికి, జైళ్లశాఖకు అందాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం జీవో విడుదల అనంతరం ఖైదీల అర్హతకు సంబంధించిన లిస్టును జైళ్ల సూపరింటెండెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి దాదాపు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టవచ్చని జైళ్లశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఖైదీల ఆశలన్నీ గణతంత్ర దినోత్సవంపై పెట్టుకోవాల్సిందేనంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జై ళ్లలో శిక్షపడిన ఖైదీలు 1,800 మంది వరకు ఉంటారని, గత జీవోల ప్రకారం అయితే వీరిలో వందల సంఖ్యలో విడుదలకు అర్హత కలిగినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.
 
నాలుగేళ్లుగా నిరాశే..!

కొంతమంది ఆవేశంతో లేక మరే ఇతర వ్యాపకాలతో చేసే నేరాలకు జీవిత ఖైదీగాను, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారు జైళ్లలో కొంత కాలం తర్వాత పశ్చాత్తాపపడి సత్ప్రవర్తన కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించేది. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో 17 సార్లు ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. దివంగత మాజీ సీఎం ఎన్‌టీరామారావు హయాంలో చేసిన నేరాలతో సంబంధం లేకుండా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరికీ విముక్తి కల్పించారు.

ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మూడుసార్లు ఖైదీలకు స్వేచ్ఛ ప్రసాదించారు. వైఎస్ మరణానంతరం చివరగా 2011లో మాత్రం కొన్ని నేరాలకు మినహాయింపు ఇచ్చి కొంతమంది ఖైదీలను మాత్రమే క్షమాభిక్షపై విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement