Aruna Sareen: ఈ బామ్మ రోజూ జైలుకు వెళుతుంది! | Aruna Sareen has spent 25 years helping prisoners, conduct yoga and skills | Sakshi
Sakshi News home page

Aruna Sareen: ఈ బామ్మ రోజూ జైలుకు వెళుతుంది!

Sep 19 2025 4:38 AM | Updated on Sep 19 2025 4:38 AM

Aruna Sareen has spent 25 years helping prisoners, conduct yoga and skills

మార్పు

ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్‌ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!

‘చాలా మంది ఉదయం ఆలయానికి వెళ్లినట్లే నేనూ జైలుకు వెళుతుంటాను’ నవ్వుతూ అంటుంది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన అరుణ. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అరుణ విపశ్యన ధ్యానప్రక్రియను సాధన చేసేది. ఆ సమయంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ కోర్సులకు సంబంధించి కరపత్రం ఒకటి చదివింది. ఆ కోర్సులు నేర్చుకోవడానికి రెడీ అయింది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ క్యాంపస్‌లో ఎన్నో కోర్సులు నేర్చుకుంది. ఆ తరువాత ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ టీచర్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది.

‘తొలిసారిగా జైలుకు వెళ్లినప్పుడు భయంగా ఏమీ అనిపించలేదు. జైలులో ఎలా ఉంటుందో ఆసక్తికరంగా పరిశీలించాను. ఖైదీలతో వివరంగా మాట్లాడాను. వారితో కలిసి భోజనం చేశాను. ప్రతి నిమిషం హాయిగా గడిచినట్లు అనిపించింది. యోగా, «ధ్యానం ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేశాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది అరుణ.

ఆనాటి నుంచి ప్రతిరోజూ ఉదయం జైలులో నాలుగు గంటల పాటు యోగా సెషన్‌లు నిర్వహిస్తోంది. జబల్పూర్‌ మాత్రమే కాదు ఇండోర్, సాత్న, భోపాల్‌లతో పాటు మధ్యప్రదేశ్‌లోని పది కారాగారాలలో యోగా సెషన్‌లు నిర్వహిస్తోంది.

‘హ్యాపీనెస్‌ ప్రోగ్రామ్‌’ పేరుతో తాను నిర్వహించే కార్యక్రమాల వల్ల ఖైదీల ఆలోచనా ధోరణిలో మార్పు రావడాన్ని ఆమె గ్రహించింది. చాలామంది ఖైదీలు ఎప్పుడు చూసినా నిరాశ, నిస్పృహలతో కనిపించేవారు. అలాంటి వారికి జీవనోత్సాహాన్ని కలిగించడంలో ‘హ్యాపీనెస్‌ ప్రోగ్రామ్‌’ ప్రభావం ఎంతోఉంది.

‘కోర్స్‌ పూర్తి చేసుకున్న ఖైదీలలో ఎంతో మార్పు వచ్చింది. తగాదాలు తగ్గాయి. కొద్దిమంది ఖైదీలలో విపరీతమైన కోపం ఉండేది. ఆ కోపంలో బ్లేడ్‌తో కోసుకొని తమకు తాము హాని చేసుకునేవారు. అలాంటి వారిలో పూర్తిగా మార్పు వచ్చింది’ అంటుంది అరుణ. గతంలో కొందరు ఖైదీలు జైలు నుంచి పారి΄ోవడానికి ప్రయత్నం చేసేవారు. అలాంటి వారిలో కూడా ‘హ్యాపీనెస్‌ ప్రోగ్రామ్‌’ మార్పు తీసుకువచ్చింది. మాదకద్రవ్యాల కేసులో జైలుకు వెళ్లాడు రాజు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మళ్లీ అదే అక్రమ వ్యాపారం చేయాలనుకునేవాడు. అయితే అరుణ నిర్వహించే హ్యాపీనెస్‌’ కార్యక్రమంతో అతడిలో మార్పు వచ్చింది.

జైలు నుంచి విడులైన రాజు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా కూలి పనులు చేసుకొని బతుకుతున్నాడు. స్థూలంగా ‘హ్యాపీనెస్‌ ప్రోగ్రాం’ ద్వారా ఖైదీలకు యోగా, ధ్యానం మాత్రమే పరిచయం కాలేదు. ఉత్సాహంతో కూడిన కొత్త జీవన విధానం పరిచయం అయింది. జైలు బయట రెడ్‌ క్రాస్‌ స్వచ్ఛంద సేవకులతో కలిసి ఎన్నో సేవాకార్యక్రమాలలో పాల్గొంటుంది అరుణ. మద్యం బారిన పడిన ఎంతోమందిని ఆ దురలవాట్ల నుంచి బయటకు తీసుకువచ్చింది. ‘జైలులో నిర్వహించే హ్యాపీనెస్‌ ప్రోగ్రాం వల్ల ఖైదీలలో క్రమశిక్షణ పెరిగింది’ అంటున్నాడు జబల్పూర్‌ సెంట్రల్‌ జైలు సూపరిండెంట్‌ అఖిలేష్‌ తోమర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement