
దొంగలు పడ్డారు.. డబ్బులు వదిలేశారు..
తాళం చెవులు బీరువాకే ఉంచారు కాబట్టి అందులో విలువైన వస్తువులేవీ ఉండవని భ్రమ పడ్డ దొంగలు.. రూ.70 వేల నగదును అలానే వదిలేసి వెళ్లారు..
హైదరాబాద్: నిర్లక్ష్యం కొన్నిసార్లు వరంగానూ మారుతుందని రుజువైంది. ఓ ఇంట్లో దొంగతనానికి ప్రవేశించిన చోరులు.. మిగతా సామాన్లన్నీ వెదికి.. బీరువాను మాత్రం వదిలేశారు. ఎందుకంటే తాళం చెవులు బీరువాకే ఉంచారు కాబట్టి అందులో విలువైన వస్తువులేవీ ఉండవని వారు భ్రమ పడ్డారు. తీరా దర్యాప్తులో మాత్రం ఆ బీరువాలో ఏకంగా రూ.70 వేల నగదు ఉందని తేలింది! జూబ్లీ హిల్స్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే..
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలోకి వచ్చే నందగిరి హిల్స్ లో జర్నలిస్ట్ కాలనీ ఉంది. అక్కడే నివసించే సీనియర్ జర్నలిస్ట్ రవీంద్రనాథ్.. రెండు నెలల కిందట అమెరికా వెళ్లారు. కారు డ్రైవర్ గానేకాక ఇంటి వాచ్ మన్ గానూ పనిచేసే దస్తగిరికి ఇంటి బాధ్యతలు అప్పగించారు. ఇంటి ఆవరణలో దస్తగిరి పడుకునేందుకు కావాల్సిన ఏర్పాటు చేశారు. అలా రవీంద్రనాథ్ కుటుంబం అమెరికా వెళ్లినప్పటి నుంచి ఇంటికి దస్తగిరి కాపలా కాస్తూనే ఉన్నాడు. అయితే రెండు రోజుల కిందట దస్తగిరి అనారోగ్యానికి గురై.. సొంత ఊరికి వెళ్లాడు.
ఆదివారం ఉదయం ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చిన దస్తగిరి.. ఇంటి కిటికీలు తొలిగించి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి యజమాని పేరున్న జర్నలిస్ట్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు.. క్రైం, క్లూస్‌టీం బృందాలను రంగంలోకి దించారు. ఇంటిని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం అమెరికాలో ఉన్న రవీంద్రనాథ్ కు ఫోన్ చేసి ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడున్నాయో తెలుసుకున్నారు. ఆ వివరాల ప్రకారం బెడ్ రూమ్ లోని బీరువాలో రూ. 70 వేల నగదును గుర్తించారు. తాళం చెవులు బీరువాకే ఉండిపోవడంతో దొంగలు పొరబడ్డారని, దర్యాప్తు కొనసాగుతుందని జూబ్లీహిల్స్ పోలీసులు చెప్పారు.