కుంటుపడిన ‘కుటుంబ ప్రయోజన’o

కుంటుపడిన ‘కుటుంబ ప్రయోజన’o - Sakshi

  • రూ.13 కోట్లున్నా.. 3 వేలకు మించని ఎన్‌ఎఫ్‌బీఎస్‌ దరఖాస్తులు

  • బాధితులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సెర్ప్‌ సీఈవో లేఖ

  • సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన(ఎన్‌ఎఫ్‌బీఎస్‌) పథకానికి పెద్దగా స్పందన ఉండడం లేదు. పేద కుటుంబ యజమాని(పెద్ద) మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయితే.. ఈ పథకం పట్ల బాధిత కుటుంబాలకు పెద్దగా అవగాహన లేకపోవడం, ఆయా కుటుంబాలను గుర్తించాల్సిన రెవెన్యూ అధికారులు  పట్టిం చుకోకపోవడమే దరఖాస్తులు తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2016–17)లో ఎన్‌ఎఫ్‌బీఎస్‌కి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.13 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 వేల బాధిత కుటుంబాలకు సాయాన్ని అందించేందుకు వీలుంది.



    అయితే గత 10 నెలల్లో ఎన్‌ఎఫ్‌బీఎస్‌ కోసం ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు 3 వేలకు మించలేదు. 750 దరఖాస్తులు ఆయా జిల్లాల డీఆర్వోల వద్ద, మరికొన్ని డివిజన్ల స్థాయిలో ఆర్డీవోల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్‌ఎఫ్‌బీఎస్‌ కింద బాధిత కుటుంబానికి  ఆర్ధిక సాయాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచాలని ఇప్పటికే సెర్ప్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి కేంద్రం ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.20 వేల చొప్పున మం జూరు చేస్తున్నప్పటికీ, ఎక్కువ మంది బాధితులకు సాయమందించే ఉద్ధేశంతో ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రూ.10 వేలకు తగ్గించింది.



    బాధిత కుటుంబానికి కేంద్రం ఇచ్చిన మేరకు మొత్తం రూ.20 వేల చొప్పున లబ్ధిదారులకు మంజూరు ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎటువంటి ఆర్థిక సాయానికి నోచుకోని బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, ఎన్‌ఎఫ్‌బీఎస్‌ పథకం పట్ల ఆయా కుటుంబాల సభ్యులకు అవగాహన కల్పించి, వెంటనే దరఖాస్తు చేసుకునే చర్యలు చేపట్టాలని సెర్ప్‌ సీఈవో నీతూకుమారి ప్రసాద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా లేఖలు రాశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top