గవర్నర్ ప్రసంగంపై విపక్షాల వాణి... | The voice of the opposition to Governor speech | Sakshi
Sakshi News home page

గవర్నర్ ప్రసంగంపై విపక్షాల వాణి...

Mar 13 2016 4:26 AM | Updated on Aug 20 2018 9:16 PM

‘‘తెలంగాణకు నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఏపీతో పోల్చినా తక్కువ వచ్చాయి.

పాతబస్తీలోనూ హైటెక్ సిటీ
 ‘‘తెలంగాణకు నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఏపీతో పోల్చినా తక్కువ వచ్చాయి. గవర్నర్ ప్రసంగంలో కరువు, మంచినీటి ఎద్దడి, పశుగ్రాసం కొరతలను ప్రస్తావించలేదు.ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల సాధనకు చర్యలు తీసుకోవాలి. ఆస్తి పన్ను, కరెంటు, నీటి చార్జీల వంటివి పెంచి ప్రజలపై భారం మోపొద్దు. హైటెక్ సిటీ మాదిరిగా హైదరాబాద్ పాతబస్తీలోనూ చిన్న హైటెక్ సిటీ సెంటర్ పెట్టాలి. అక్కడ రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి పనులు చేపట్టాలి. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మజ్లిస్ మద్దతుంటుంది’’  
 - అక్బరుద్దీన్ ఒవైసీ, మజ్లిస్
 
 ఆదాయ, ఆనంద సూచీలు కావాలి
 ‘‘అభివృద్ధి సూచీకి బదులు ఆదాయ, ఆనంద సూచీలను రూపొందించాలి. వ్యవసాయ రంగ వృద్ధి 0.7 శాతానికే పరిమితం కావడం ఆందోళనకరం. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను ఎప్పటికప్పుడే చెల్లించడంతో ఎంతోమంది పెద్ద చదువులు చదవగలిగారు. రూ.3,700 కోట్ల ఫీజు బకాయిలను తక్షణం విడుదల చేయాలి. వైఎస్ మాదిరిగానే గిరిజనుల పోడు భూములకు పట్టాలివ్వాలి’’    
- పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ
 
 చేతలు గడప దాటడం లేదు
 ‘‘గవర్నర్ ప్రసంగం టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలా, కరపత్రంలా ఉంది. రైతు ఆత్మహత్యల నివారణ, వారిని ఆదుకునే చర్యల ప్రస్తావనే లేదు. రుణ మాఫీని ఏకమొత్తంలో చేయాలి. డబుల్ బెడ్రూం ఇళ్లపై పేదల ఆశలను రాజకీయంగా సొమ్ము చేసుకుంటున్నారు. కేజీ టు పీజీ మొదలే కాలేదు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించే చర్యల్లేవు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి’’    
     -కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత
 
 ఎమ్మెల్యేల కొనుగోళ్లే స్థిరత్వమా?
 ‘‘విపక్ష ఎమ్మెల్యేలను కొనడమే ప్రభుత్వ ధృడత్వం, స్థిరత్వమా? గవర్నర్ అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పారు. అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేయడంలో అధికార టీఆర్‌ఎస్ విఫలమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తనతో అనైతిక పనులు చేయిస్తున్నందుకే గవర్నర్ తరచూ గుళ్ల చుట్టూ తిరిగి పొర్లుదండాలు పెడుతున్నట్లున్నారు! రోహిత్ ఆత్మహత్య కేసులో కేంద్ర మంత్రి దత్తాత్రేయను అరెస్ట్ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డే చెప్పారు. మరాయన్ను ఇంకా అరెస్టు చేయలేదేం? నా నియోజకవర్గంలోనే అత్యధిక సంఖ్యలో దళితులు, పేదలుంటే వారిలో కేవలం నలుగురికి 12 ఎకరాలు పంపిణీ చేశారు. ఇదీ దళితులకు భూ పంపిణీ తాలూకు వాస్తవ దుస్థితి!’’    
- సంపత్‌కుమార్, కాంగ్రెస్
 
 తూతూమంత్రంగా చదివేశారు
 ‘‘ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ మూసగా, తూతూమంత్రంగా చదివారు. రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలనూ సూచించలేదు. తగిన గిట్టుబాటు ధరలు కల్పించాలి. మారె ్కటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తేవాలి. కేజీ టు పీజీ చదువుపై ఏమీ జరగలేదు. వర్సిటీలకు వీసీల్లేరు. సీఎం ఆశయాలు  బాగున్నా ఆచరణ లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించొద్దు. వాటర్‌గ్రిడ్‌కు బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లు కేటాయించారు గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలే చెల్లించలేదు. పథకంలో లోపాలుంటే సవరించాల్సిందే. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి, బిల్లు పెట్టేలా కేసీఆర్ చొరవ తీసుకోవాలి’’  
 - ఆర్.కృష్ణయ్య, టీడీపీ
 
 ప్రాజెక్టులు చేపట్టాలి
 ‘‘పుణ్యకాలం గడవకముందే ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. ఇప్పటికే చేపట్టిన వాటిని తక్షణం పూర్తి చేయాలి. నల్లగొండ జిల్లాలోని వరదకాలువ, డిండి ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలి. రీ డిజైనింగ్ అంటూ రెండేళ్లుగా జాప్యం చేస్తున్నారు. కరువు తీవ్రంగా ఉన్నా కేంద్రం సాయం రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. కరువు నివారణ, సహాయం, వ్యవసాయ కూలీలను ఆదుకోవడం వంటివాటి ప్రస్తావనే గవర్నర్ ప్రసంగంలో లేదు. గిరిజనులకు జనాభా మేరకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’    - రవీంద్రకుమార్, సీపీఐ
 
 కరువు ప్రస్తావనేదీ?
 ‘‘గవర్నర్ ప్రసంగంలో అసలు కరువు ప్రస్తావనే లేదు. రైతుల రుణాలను 50 శాతం ఒకేసారి మాఫీ చేయాలి. బీసీ, మైనారిటీ, వికలాంగులకు విడిగా సబ్‌ప్లాన్లుపెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల పటిష్టానికి చర్యలు తీసుకోవాలి. హాస్టళ్లలో, ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలి. పోడు రైతులకు పట్టాలివ్వాలి’’
 - సున్నం రాజయ్య, సీపీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement