రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల షెడ్యూలుపై విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది.
త్వరలో ఉపముఖ్యమంత్రి ఆమోదానికి ఫైలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల షెడ్యూలుపై విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. పరీక్ష ప్రారంభ తేదీలతో మూడు రకాల టైంటేబుళ్లను సిద్ధం చేసింది. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఆమోదానికి ఒకట్రెండు రోజుల్లో ఫైలు పంపించేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చి 11, 14, 16న పరీక్షలు ప్రారంభించేలా మూడు రకాల టైంటేబుళ్లను సిద్ధం చేసింది. ఇంటర్మీడియెట్ పరీక్షలను మార్చి 1, 2 తేదీల్లో లేదా 7, 8 తేదీల్లో ప్రారంభించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఆలోచిస్తోంది.
మార్చి 1 లేదా 2 తేదీల్లో ప్రారంభిస్తే టెన్‌త పరీక్షలను మార్చి 11 నుంచి ప్రారంభించొచ్చని భావిస్తోంది. ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రారంభ తేదీ ఆలస్యమైతే పదో తరగతి పరీక్షలను మార్చి 14 లేదా 16న ప్రారంభించేలా టైంటేబుళ్లను విద్యాశాఖ సిద్ధం చేసినట్లు తెలిసింది. మొత్తానికి ఈ వారంలో కడియం శ్రీహరి ఆమోదం తర్వాత టెన్‌త, ఇంటర్మీడియెట్ పరీక్ష టైంటేబుల్స్ ప్రకటన వెలువడనుంది.