ఎండగడదాం.. అప్పుడే వద్దు! | telangana congress party leaders have inner conflicts | Sakshi
Sakshi News home page

ఎండగడదాం.. అప్పుడే వద్దు!

Oct 3 2014 2:11 AM | Updated on Aug 15 2018 9:22 PM

ఎండగడదాం.. అప్పుడే వద్దు! - Sakshi

ఎండగడదాం.. అప్పుడే వద్దు!

రాష్ట్ర ప్రభుత్వ పాలనను ఎండగట్టే అంశంపై తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో టీపీసీసీ, కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) మధ్య విభేదాలు నెలకొన్నాయి.

ప్రభుత్వాన్ని విమర్శించడంపై టీపీసీసీ - సీఎల్పీ మధ్య విభేదాలు

దూకుడు పెంచాల్సిందేనన్న పొన్నాల
జనమే పట్టించుకోవడం లేదు.. ఇప్పుడే ఎందుకన్న జానారెడ్డి
జానాతో విభేదించిన పొన్నాల, షబ్బీర్, పొంగులేటి
కేసీఆర్‌ను ఎండగడుతూ ప్రెస్‌మీట్.. అయిష్టంగానే హాజరైన జానా

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాలనను ఎండగట్టే అంశంపై తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో టీపీసీసీ, కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) మధ్య విభేదాలు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలను చేపట్టడంతోపాటు అసెంబ్లీలో దూకుడుగా వెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రతిపాదించగా.. అందుకు టీసీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం విముఖత చూపారు.

ఇప్పుడు ప్రజలే బయటకు వచ్చేందుకు ఆసక్తిగా లేరని, అలాంటప్పుడు ఆందోళనలు చేయడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు గురువారం టీకాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం పొన్నాల, జానారెడ్డితో పాటు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు సమావేశమై కేసీఆర్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిం చారు. టీపీసీసీ వర్గాల సమాచారం మేరకు... ఈ భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ కోతలతోపాటు రుణమాఫీ అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పొన్నాల పేర్కొన్నారు. కేసీఆర్ నాలుగు నెలల పాలనలో రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వీటిని అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లాలని ప్రతిపాదించారు.

అయితే దీనిపై జానారెడ్డి విముఖత చూపారు. ‘‘తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్సే అయినా జనం మాత్రం మనకు ఓట్లేయకుండా టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. పైగా కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే అయింది. కనీసం ఆరు నెలల సమయమైనా ఇద్దాం. ఇప్పటికిప్పుడే దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదు. జనం కూడా అధికారంలోకి టీఆర్‌ఎస్ ఇప్పుడే వచ్చింది కదా.. పనులు చేయడానికి కొంత సమయం పడుతుంది కదా! అనే భావనలో ఉన్నారు. అసెంబ్లీలోనూ రుణమాఫీ, విద్యుత్ కోత వంటి అంశాలపై చర్చించేందుకే పరిమితమవుదాం. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, సంఖ్య కుదింపుపై ఇప్పుడే మనం తొందరపడొద్దు..’’అని జానా సూచించారు. దీంతో వెంటనే షబ్బీర్‌అలీ, పొంగులేటి స్పందిస్తూ... ‘‘అదేందన్నా.. మన దగ్గర తప్పులు పెట్టుకుని జనాన్ని అంటే ఏం లాభం? ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్‌పై దూకుడుగా వెళ్లకపోతే ఎట్లా? మీరు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తూ మాట్లాడాల్సిందే. లేకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయి..’’ అని పేర్కొన్నారు.

కానీ జానారెడ్డి మాత్రం ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇవ్వకుండా దూకుడుగా వెళితే ప్రజలు మనల్నే నిందించే ప్రమాదముందనే భావన వ్యక్తం చేశారు. అయినా మిగతా నేతలు జానారెడ్డితో విభేదించారు. రైతుల మరణాలు, రుణమాఫీ, విద్యుత్ కోతలు, అమరవీరుల సంఖ్య కుదింపు వంటి అంశాలపై అందరం కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిద్దామని ప్రతిపాదించారు. అయితే జానారెడ్డి దీనికి విముఖత చూపినా.. అందరూ పట్టుబట్టడంతో అయిష్టం గానే వారితో కలిసి గాంధీభవన్‌లో ఏర్పాటు  చేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్‌మీట్‌లో పొన్నాల ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. పక్కనే ఉన్న జానారెడ్డి మాత్రం మీడియా సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన నేతల చిత్రపటాలను పరికిస్తూ ఉండిపోయారు. అనంతరం రెండు నిమిషాలు ముక్తసరిగా మాట్లాడి ముగించారు. ఇదంతా గమనించిన పార్టీ నేతలు.. ఓడిపోయినోళ్లంతా ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు విరుచుకుపడదామా? అని చూస్తుంటే.. గెలిచిన నేతలు మాత్రం పాలకపక్షంతో అప్పుడే వైరం అవసరం లేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement