
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి
నల్గొండ జిల్లా: తనకు పదవి లేకున్నా.. ఉన్నట్లేనని, వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నానని, తన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తన కుమారులతో కలిసి అభివృద్ధిలో భాగస్వాముడిని అవుతానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దవూర మండలం గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లో మాజీ సర్పంచ్ దాచిరెడ్డి మాధవరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి(దాచిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి) సోదరులు రూ.12లక్షల సొంత ఖర్చులతో నిర్మించిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌లను సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు అప్పగించడం హర్షణీయమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మాధవరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని, ఇళ్లు రాలేదని ఎవరూ బాధపడవద్దని సూచించారు.
ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధచూపుతూ నాకంటే ఎక్కువ మన్ననలు పొందాలని ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డికి సూచించారు. వారంలో రెండు రోజులు మద్యం తాగడం బంద్ చేసి ఆ డబ్బులతో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని తనతో పాటు డీవీఎన్‌రెడ్డి కూడా కొంత సహాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ధర్మారెడ్డి, బోయ నరేందర్‌రెడ్డి, వెంకటయ్య, రామలింగయ్య, నాగరాజు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.