అంచనా రూ. 1.8 లక్షల కోట్లు! | Telangana budget is processing on | Sakshi
Sakshi News home page

అంచనా రూ. 1.8 లక్షల కోట్లు!

Jan 3 2018 3:05 AM | Updated on Jan 3 2018 3:05 AM

Telangana budget is processing on - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై కసరత్తు మొదలైంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.49 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. 2018–19 సంవత్సరానికి ఎంతమేర బడ్జెట్‌ ప్రతిపాదించాలో శాఖల వారీగా ప్రతిపాదనలు తెప్పిస్తోంది. ఇప్పటికే పని మొదలుపెట్టిన ఆర్థిక శాఖ, వచ్చే బడ్జెట్‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను కోరింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ రూ. 1.80 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

మిగిలాయా.. తగిలాయా?
2018–19 బడ్జెట్‌ను మార్చిలోనే ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుండటంతో బడ్జెట్‌ కసరత్తు వేగంగా జరుగుతోంది. గతేడాది బడ్జెట్‌ ప్రతిపాదనలు, సవరించిన అంచనాలు, ఖర్చు, ఏ అంశాలకు ఎంత ఖర్చు చేశారు.. నిధులు మిగిలాయా.. తగిలాయా? పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆ శాఖ నిర్వహించే వెబ్‌సైట్, పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు సమర్పించేందుకు గత నెల 30 నుంచే వెసులుబాటు కల్పించింది. శాఖ వారీగా బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు కూడా ఈ నెలలో షురూ కానున్నాయి. శాఖల ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత వచ్చే ఏడాది అవసరాలను అంచనా వేసి ఏ శాఖకు ఎంత బడ్జెట్‌ కేటాయించాలో సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.  

భారీ పథకాలు.. భారీగా నిధులు..
2018–19 బడ్జెట్‌లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించాల్సిన నేపథ్యంలో ప్రతిపాదనలూ భారీగా ఉండే అవకాశముంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇప్పటికే ప్రకటించిన రైతులకు రూ. 8 వేల పెట్టుబడి సాయం దృష్టిలో ఉంచుకుని ఈసారి బడ్జెట్‌ రూ. 1.80 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతేడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో తొలుత ఒడిదుడుకులు ఎదురైనా తర్వాత రాబడి పుంజుకోవటంతో 2018–19 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఉదారంగానే ఆలోచించే అవకాశ ముందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement