వరంగల్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇళ్ల కూల్చివేతపై ఉమ్మడి హైకోర్టు యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇళ్ల కూల్చివేతపై ఉమ్మడి హైకోర్టు యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఆర్ నగర్‌లో మూడు దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న తమకు అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ కె.రాజు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది బూర రమేశ్ వాదనలు వినిపిస్తూ, అధికారులు రెండు పడక గదుల ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నా వారి ఇళ్లను మాత్రమే కూల్చివేస్తామని హామీ ఇచ్చి, ఆకస్మాత్తుగా వచ్చి 40 ఇళ్ల వరకు కూల్చివేశారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.