రైలు బోగీలో అస్తిపంజరం బయటపడ్డ ఉదంతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ...
సికింద్రాబాద్ : రైలు బోగీలో అస్థిపంజరం బయటపడ్డ ఉదంతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలులోని రెండు బోగీలను మరమ్మతు కోసం అదేరోజు షెడ్డుకు తరలించారు. మరమ్మతు చేసేందుకు ఇద్దరు కార్మికులు సోమవారం ఆ బోగీల వద్దకు వచ్చారు. బోగీలోంచి దుర్వాసన రావటంతో వారు పోలీసులకు సమాచారం అందించాచు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోకి వెళ్లేందుకు యత్నించగా తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో కిటికీలోంచి పరిశీలించగా అస్థిపంజరం కనిపించింది. గ్యాస్ కట్టర్తో తలుపును తెరిచి లోపల ఉన్న పురుషుడి అస్తిపంజరాన్ని బయటకు తీశారు. ఒంటిపై ఖాకీ చొక్కా మాత్రమే ఉంది. అస్థిపంజరాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలేవీ లభించలేదు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక గుండెపోటుతో చనిపోయాడా అనేది తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.