
ఈ పాపాయి విమానంలో ఉచితంగా తిరగొచ్చు!
తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతున్న ఈ చిన్నారి బంపర్ అవకాశాన్ని కొట్టేసింది. జీవితంలో తాను ఎప్పుడు కావాలనుకుంటే...
హైదరాబాద్: తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతున్న ఈ చిన్నారి బంపర్ అవకాశాన్ని కొట్టేసింది. జీవితంలో తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తమ విమానంలో ఉచితంగా 10 లక్షల ఎయిర్ మైళ్లు ప్రయాణించవచ్చని సెబూ పసిఫిక్ ఎయిర్ సంస్థ ప్రకటించింది. ఎందుకంటే... దుబాయి నుంచి మనీలా వెళ్తున్న సెబూ పసిఫిక్ విమానంలోనే ఈ చిన్నారి బుధవారం జన్మించింది. తమ సంస్థ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, అందుకే ఈ పాపకు కుటుంబ సభ్యులతో కలిసి తమ విమానంలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు సెబూ ప్రకటించింది.
కాగా, గగనతలంలో పయనిస్తున్న విమానంలో జన్మించిన పాపాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నెలలు నిండకుండానే పుట్టిన పాపాయి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని అపోలో క్రేడల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విమానం ల్యాండయ్యే సమయంలో పాపాయి శరీరం నీలం రంగులోకి మారి చల్లబడిపోయిందని, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో స్పెషలిస్ట్ టీమ్ ఆమెను తీసుకొచ్చిందని పేర్కొంది. పాపాయి 32 వారాలకే జన్మించిందని, 1.6 కేజీల బరువు మాత్రమే ఉందని వివరించింది.