ఆటవిడుపు కోసం తన బంధువులతో కలిసి నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు వెళ్లిన ఓ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు.
రాంగోపాల్‌పేట్ (సికింద్రాబాద్): ఆటవిడుపు కోసం తన బంధువులతో కలిసి నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు వెళ్లిన ఓ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాటిగడ్డకు చెందిన ఇంతియాజ్ అనే సాప్ట్‌వేర్ ఇంజనీర్ తన కుటుంబ సభ్యులు 10 మందితో కలసి శనివారం మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు వెళ్లాడు. 9వ తరగతి చదివే ఇంతియాజ్ అక్క కుమారుడైన మహ్మద్ సమీర్ అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో ఉండే మ్యాట్‌రైడ్‌కు వెళ్లాడు. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు బింటూ అతన్ని అనుమతించలేదు.
45 కేజీల బరువుకు పైబడి ఉన్న వాళ్లను మాత్రమే అనుమతిస్తామని సెక్యూరిటీ గార్డు చెప్పాడు. దీంతో వారి మధ్య గొడవ జరుగుతుండగానే బింటూ సోదరుడు మహ్మద్ జుబేర్ (18) ఇక్కడికి చేరుకుని సెక్యూరిటీగార్డుని ప్రశ్నించడంతో... అతడు మరింత ర్యాష్‌గా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది జుబేర్‌ను పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్లి చితకబాది వదలి పెట్టారు. అనంతరం జుబేర్ అక్కడే ఉన్న కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. ఇంతియాజ్ రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.