జిల్‌.. జిల్‌.. జిగేల్‌ | secunderabad railway to be developed to international level | Sakshi
Sakshi News home page

జిల్‌.. జిల్‌.. జిగేల్‌

Feb 4 2017 2:06 AM | Updated on Sep 5 2017 2:49 AM

జిల్‌.. జిల్‌.. జిగేల్‌

జిల్‌.. జిల్‌.. జిగేల్‌

అదో భారీ భవన సముదాయం.. పెద్ద పెద్ద షోరూమ్‌లు.. నాలుగైదు సినిమా థియేటర్లుండే మల్టీప్లెక్స్‌..

అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌
- షోరూమ్‌లు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణం
- స్విమ్మింగ్‌ పూల్, ప్లేజోన్‌ కూడా ఏర్పాటు
- ఎటు వెళ్లాలన్నా ఎస్కలేటర్లు, లిఫ్టులు
- జిగేలుమనే ఎల్‌ఈడీ వెలుగులు
- భారీ స్థాయిలో మల్టీ లెవల్‌ పార్కింగ్‌
- 8న ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన
- అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి రైల్వే శాఖ చర్యలు


సాక్షి, హైదరాబాద్‌: అదో భారీ భవన సముదాయం.. పెద్ద పెద్ద షోరూమ్‌లు.. నాలుగైదు సినిమా థియేటర్లుండే మల్టీప్లెక్స్‌.. మరోవైపు వీడియో గేమ్స్‌ నుంచి స్నూకర్‌ పూల్‌ వరకు ప్లేజోన్‌.. ఓ అంతస్తులో స్విమ్మింగ్‌ పూల్‌.. ఎక్కడికి వెళ్లాలన్నా వేగంగా కదిలే ఎస్కలేటర్లు, లిఫ్టులు.. మధ్యలో అందమైన చెట్లతో డిజిటల్‌ ఉద్యానవనం.. ఎటు చూసినా జిగేల్‌మనే ఎల్‌ఈడీ లైట్లు.. మధ్య మధ్యలో రైలు కూతలు..!? హడావుడిగా వచ్చి వెళ్లే ప్రయాణికులు..!?.. ఇదేమిటంటారా... సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ భవిష్యత్తు స్వరూపమిది. వందల సంఖ్యలో కార్లు వచ్చినా పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా మల్టీలెవల్‌ పార్కింగ్‌ టవర్‌  నిర్మిస్తారు. కార్లను ఎలివేటర్లే (లిఫ్టులు) పైకి కిందకు చేరుస్తాయి. ఇటు రైళ్లు, అటు ఆధునిక హోయలు మేళవించి ఈ ఆధునిక ప్రపంచాన్ని రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఆ దిశగా ఈనెల 8న తొలి అడుగు పడబోతోంది.


అంతర్జాతీయ స్థాయిలో..
దేశవ్యాప్తంగా 25 రైల్వేస్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణ నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎంపికైంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) కింద దీనిని అభివృద్ధి చేయనున్నారు. స్టేషన్‌ ప్రస్తుత భవనం, దానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని ఇందుకు వినియోగిస్తారు. ఆ స్థలంలో వాణిజ్యపరమైన నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ప్రైవేటు సంస్థలు లాభాలు ఆర్జిస్తాయి. అందుకు ప్రతిగా స్టేషన్‌లో ప్రయాణికులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తారు. స్టేషన్‌లోకి వెళ్లగానే మన సంప్రదాయ రైల్వేస్టేషన్‌ జాడ ఎక్కడా లేకుండా పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దనున్నారు. ఈనెల 8న దీనికి సంబం«ధించి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన వెలువడనుంది. విదేశీ కంపెనీలు కూడా ఇందులో పాల్గొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. వచ్చే దరఖాస్తులను పరిశీలించి అనువైన డిజైన్‌ ఎంపిక చేసి, పనులను అప్పగిస్తారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని తరహాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రూపుదిద్దుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు.


ప్రస్తుత భవనాన్ని కూల్చకుండానే..
తెలంగాణ ప్రాంతంలో రూపుదిద్దుకున్న మొట్టమొదటి రైల్వేస్టేషన్‌ సికింద్రాబాద్‌. 1874లో ఇది అందుబాటులోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్‌ స్టేట్‌ను భారత ఉపఖండంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించాలన్న ఉద్దేశంతో ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టారు. మహారాష్ట్రలోని వాడి నుంచి సికింద్రాబాద్‌కు రైల్వే లైన్‌ ఏర్పాటు చేసి.. ఇక్కడ స్టేషన్‌ భవనాన్ని నిర్మించారు. ఇంత చారిత్రక ప్రాధాన్యమున్నది కావడంతో.. ప్రస్తుత భవనాన్ని కూల్చకుండానే, రీడిజైన్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. అసలు సికింద్రాబాద్‌ స్టేషన్‌పై భారం తగ్గించేందుకు నగర శివార్లలోని చర్లపల్లిలో ఆరు ప్లాట్‌ఫాంల సామర్థ్యంతో శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మించనున్నారు. అది రూపుదిద్దుకుంటే సికింద్రాబాద్‌ స్టేషన్‌పై భారం తగ్గి.. కొత్త నమూనాలో తీర్చిదిద్దేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement