సీటుకు నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీనా? | Sakshi
Sakshi News home page

సీటుకు నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీనా?

Published Wed, Aug 12 2015 2:31 AM

Seat four-year bank guarantee?

సాక్షి, హైదరాబాద్: యాజమాన్య కోటా కింద ఉన్న 35 శాతం సీట్ల విషయంలో తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల నిర్వాకంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రైవేటు వైద్య కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెబ్‌సైట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో కౌన్సెలింగ్ ఫీజు, కోర్సు ఫీజు వివరాలను పొందుపరిచారు. బీ కేటగిరీ కింద ఎంబీబీఎస్‌కు ఏడాదికి రూ.9 లక్షల చొప్పున చెల్లించాలి. ఆ ప్రకారం ఐదేళ్ల కోర్సుకు రూ. 45 లక్షలు చెల్లించాలి.

కౌన్సెలింగ్‌లో సీటు పొందే విద్యార్థులు మొదటి ఏడాదికి రూ. 9 లక్షలు చెల్లించడంతోపాటు మిగిలిన నాలుగేళ్లకు సంబంధించి రూ. 36 లక్షల బ్యాంకు గ్యారంటీ చూపించాలని స్పష్టంచేశారు. అలాగే బీడీఎస్ కోర్సుకు మొదటి ఏడాది రూ. 4 లక్షలు ఫీజు చెల్లించడంతోపాటు... మిగిలిన మూడేళ్లకు సంబంధించిన రూ. 12 లక్షలకు బ్యాంకు గ్యారంటీ కోరారు.

దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందుగానే కోర్సు కాలం మొత్తం ఫీజుకు గ్యారంటీ కోరడంపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు.  దీనిపై వైద్య శాఖ అధికారులు కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement