ఇద్దరు రౌడీషీటర్లు ఒకరినొకరు చంపుకునేందుకు కాపు కాశారు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో పారిపోయేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయారు.
హైదరాబాద్ : ఇద్దరు రౌడీషీటర్లు ఒకరినొకరు చంపుకునేందుకు కాపు కాశారు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో పారిపోయేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్ బి.రవీందర్ కథనం ప్రకారం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే రౌడీ షీటర్ షేక్ సుల్తాన్కు లంగర్హౌస్ ఠాణా పరిధిలో రౌడీషీటర్గా ఉన్న మహ్మద్ నబీల మద్య పాత కక్షలున్నాయి.
ఈ నేపథ్యంలో ఒకరినొకరు చంపుకొనేందుకు కార్వాన్ పాకీజా హోటల్ వద్ద స్కెచ్ గీసుకున్నారు. సుల్తాన్...మహ్మద్ నబీలు పరస్పరం దాడి చేసుకుంటున్న సమయంలో టప్పాచబుత్ర పోలీసుల పెట్రోలింగ్ వాహనం అటుగా వచ్చింది. పోలీస్ సైరన్ విని ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇది గమనించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దాంతో వారిద్దరిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.