ప్రసాదరావు కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీలోని 18 సర్కిళ్లను 30గా మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ప్రసాదరావు కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీలోని 18 సర్కిళ్లను 30గా మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ముందుగానే అన్ని విభాగాల్లో అవసరమైన పోస్టుల్ని వీలైనంత త్వరితంగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పోస్టుల భర్తీలో ఏ జోన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే తదితర అంశాల్లో స్పష్టత కోసం... సిఫార్సులు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రసాదరావుతో శుక్రవారం సమావేశమయ్యారు. కమిషనర్ కృష్ణబాబు, అడిషనల్ కమిషనర్ (పరిపాలన) సీఎన్ రఘుప్రసాద్, పబ్లిక్‌హెల్త్ ఈఎన్‌సీ పాండురంగారావు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివిధ విభాగాలకు సంబంధించిన పోస్టుల్లో ఏ సర్కిల్ పరిధిలోకి అవసరమైన పోస్టుల్లో ఆ సర్కిల్‌లోని వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇంజినీరింగ్ విభాగంలో భర్తీ చేయాల్సిన ఏఈలకు సంబంధించి మొత్తం పోస్టుల్లో 50 శాతం 6వ జోన్ వారికి, మిగతా 50 శాతం సిటీజోన్ (7వజోన్- హైదరాబాద్ కోర్ ఏరియా) లోని వారికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు కృష్ణబాబు తెలిపా రు. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతమున్న టీపీఎస్‌లకు సర్వీసు రూల్స్ లేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తులో అలా లేకుండా ఉండేందుకు వారికి కూడా సర్వీసు రూల్స్ పొందుపరిచామన్నారు.
జిల్లా, జోనల్ స్థాయి పోస్టులకు సంబంధించి ఒక అంచనాకు వచ్చామని, ప్రభుత్వ ఆమోదం లభించగానే భర్తీ చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా సగం పోస్టులు, కొత్త రిక్రూట్‌మెంట్ల ద్వారా మిగతావి భర్తీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామన్నారు. ప్రసాదరావు కమిటీ సిపార్సుల మేరకు మొత్తం 2607 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, తొలిదశలో 1307 భర్తీ చేస్తారు.