ప్రాజెక్టుల వద్దే విపక్షాలకు సమాధానం | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల వద్దే విపక్షాలకు సమాధానం

Published Thu, Jul 28 2016 3:20 AM

ప్రాజెక్టుల వద్దే విపక్షాలకు సమాధానం

రాష్ట్ర ప్రణాళిక బోర్డు  ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన ప్రతి పనిని వ్యతిరేకించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి ప్రాజెక్టుల యాత్ర చేపడతామని, ప్రతిపక్షాలు, నిపుణులు ఎవరు వచ్చినా ప్రాజెక్టుల వద్దే సమాధానం చెబుతామన్నారు. కృష్ణా నదిపై ఆంధ్రా పాలకులు అక్రమ ప్రాజెక్టులు నిర్మించినా కాంగ్రెస్‌నేతలు డీకే అరుణ, మల్లు భట్టివిక్రమార్క ఎందుకు అడ్డుకోలేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పేరిట తెలంగాణలో 1.60 లక్షల ఎకరాలు ముంచుతున్నా బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి స్పందించలేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా ప్రాజెక్టులపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. 


హింసతో ప్రాజెక్టులను అడ్డుకునే యత్నం: గొంగిడి సునీత
కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించగా హింసాత్మక ఘటనలతో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఏనాడూ నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదని, ప్రాజెక్టులను అడ్డుకొని ప్రజల నోట్లో మట్టికొడితే భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో ఆ ఇద్దరూ అడుగుపెట్టలేరని హెచ్చరించారు. 

 

Advertisement
Advertisement