
ఎన్‌సీఎల్‌టీలో వైఎస్సార్‌సీపీ అధినేత తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు
విజయమ్మ ఓ ట్రస్టీనే.. ఆమె నేరుగా షేర్లు బదిలీ చేయజాలరు
షేర్ల సర్టిఫికెట్ లేకుండా బదిలీ చేయడం సాధ్యంకాదు
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో షేర్ల బదిలీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి
తదుపరి విచారణ మే 30కి వాయిదా వేసిన ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: చెల్లెలిపై ప్రేమ, అభిమానంతో చేసుకున్న తొలి ఒప్పందమే రద్దయినప్పుడు... ఆ ఒప్పందం ప్రకారం చేసుకున్న గిఫ్ట్‌డీడ్ చెల్లుబాటే కాదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఎన్‌సీఎల్‌టీలో న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘చెల్లెలు షర్మిలపై ప్రేమ, అభిమానాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు తన సొంత ఆస్తుల్లో వాటా ఇవ్వాలనుకున్నారు. ఆయన ఇవ్వాలనుకున్న ఆస్తి కుటుంబ వారసత్వంగా వచ్చింది కాదు. ఆయన సొంత ఆస్తి. ఈ మేరకు 2019లో తల్లి, చెల్లెలు సమక్షంలో ఎంఓయూ చేసుకున్నాక... పలు ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి కనక కేసులన్నీ తేలాక ఎంఓయూ ప్రకారం ఆమెకు ఆస్తులు బదలాయించాలని భావించారు.
కానీ 2024లో షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరారు. జగన్‌ను, ఆయన ప్రభుత్వాన్ని బహిరంగంగా తూలనాడుతూ విమర్శలు చేశారు. సయోధ్యకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని తండ్రి ఎవరికివ్వాల్సింది వారికిచ్చారని, ప్రేమాభిమానాలతో తాను ఇస్తానన్న ఆస్తులు ఆమె అంతలా తూలనాడుతున్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ భావించారు.
తీరు మారకపోతే ఎంవోయూ రద్దు చేసుకుంటానని చెప్పారు. దీంతో షర్మిల తమ తల్లి విజయమ్మపై ఒత్తిడి తెచ్చి సరస్వతి పవర్‌లో షేర్లను చట్టవిరుద్ధంగా బదిలీ చేయించుకున్నారు. షేర్ సర్టిఫికెట్, షేర్ బదిలీ ఫారం పోయిందని చెప్పి.. అక్రమంగా బదిలీ చేసేసుకున్నారు. ఇది చట్టవిరుద్ధం. 51 శాతం షేర్లున్న వ్యక్తికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బదిలీ చేయటం న్యాయవిరుద్ధం’అని జగన్ న్యాయవాది పేర్కొన్నారు.
గిఫ్ట్‌డీడ్‌కు సంబంధించి విజయమ్మ ఓ ట్రస్టీ మాత్రమేనని, ఆమెకు షేర్లు బదిలీ చేసే అధికారం లేదని జగన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. బాండ్ కాపీని కోర్టుకు ఇవ్వాలని కోరగా... ఇప్పుడు లేదని, తెప్పించి ఇస్తామని చెప్పారు. బోర్డు భేటీకి తాను హాజరుకాకున్నా హాజరైనట్లు పత్రాలు సృష్టించారని డైరెక్టరు యశ్వంత్ తరఫు న్యాయవాది వెల్లడించారు. విజయమ్మ, జగన్ కలిసే ఉంటున్నారని.. తల్లి అంటే ఆయనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని విజయమ్మ తరఫు సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి చెప్పారు.
ఒకే ఇంట్లో ఉంటున్నారు కనుక షేర్ సర్టిఫికెట్ జగన్ వద్ద ఉన్నా.. విజయమ్మ వద్ద ఉన్నా ఒకటేనన్నారు. రాజీవ్ భరద్వాజ్(జ్యుడిషీయల్), సంజయ్ పూరి(టెక్నికల్)తో కూడిన బెంచ్ ఈ వాదనలు విన్న అనంతరం... తదుపరి విచారణను మే 30కి వాయిదా వేసింది. అప్పటిలోగా లిఖిత పూర్వక వాదనలుంటే సమర్పించాలని న్యాయవాదులకు స్పష్టం చేసింది.