గత రెండు మూడు రోజుల నుంచి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. టాలీవుడ్‌లోని పలువురు నిర్మాతల దగ్గర నుంచి ఈ యువ దర్శకుడు అడ్వాన్సులు తీసుకున్నాడని, బదులుగా సినిమాలు చేయకుండా ఆలస్యం చేస్తున్నాడని.. దీంతో సదరు నిర్మాతలు ఫిలిం ఛాంబర్‌ని ఆశ్రయించారని వినిపించింది. ఇదిలా ఉండగా 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఒకరిపై ఒకరు ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదులు చేసుకున్నారనే విషయం బయటకు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.
'హనుమాన్' తర్వాత అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు తమ నిర్మాణ సంస్థలోనే చేస్తానని చెప్పి రూ.10.34 కోట్ల అడ్వాన్స్ ప్రశాంత్ వర్మ తీసుకున్నారని, కానీ నిమాలు చేయడం లేదని నిర్మాతల మండలిలో ప్రశాంత్‌పై నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రాల వల్ల జరిగిన నష్టానికిగానూ ప్రశాంత్ వర్మ నుంచి తమకు రూ.200 కోట్ల నష్టపరిహారం కావాలని నిరంజన్ రెడ్డి కోరారు.
(ఇదీ చదవండి: ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు)
మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి చర్యల వల్లే తనకు భారీ నష్టాలు, కెరీర్‌లో ఎదురుదెబ్బలు తగిలాయని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా నిరంజన్ రెడ్డికి తాను ఏమీ అప్పులేనని.. అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస లాంటి సినిమాలు ఆయనతో చేస్తానని ఎక్కడా చెప్పలేదని, అగ్రిమెంట్లు లాంటివి కూడా జరగలేదని అన్నట్లు న్యూస్ బయటకొచ్చింది. తాను దర్శకత్వం వహించిన హనుమాన్ రూ. 295 కోట్లు రాబట్టిందని, ఆ లాభాల నుంచి తనకు వాటా రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.15.82 కోట్లు మాత్రమే ఇచ్చారని, తనకు ఇవ్వాల్సిన వాటాని ఎగ్గొట్టేందుకు ఈ డ్రామాలన్నీ అని ప్రశాంత్ వర్మ అన్నట్లు తెలిసింది.
ఇప్పుడు ఈ వివాదంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఓ నోట్ రిలీజ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'పలు మీడియా, న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాల్లో అసంపూర్తి, ధ్రువీకరించని సమాచారం మాత్రమే చూపిస్తున్నారు. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్, డైరెక్టర్ అసోసియేషన్ దగ్గర ఈ వివాదం పెండింగ్‌లో ఉంది. అక్కడ మాట్లాడిన విషయాలన్నీ బయటకు చెప్పడం సరికాదు. అలానే నాపై చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవం. ప్రతీకారంతో చేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఛానెల్స్ కూడా అసంపూర్తి సమాచారాన్ని చూపిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ నుంచి తుది తీర్పు వచ్చే వరకు వేచి ఉండండి' అని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి వీరిద్దరిలో ఎవరు తప్పు చేశారు? ఎవరు కరెక్ట్ అనేది కొన్ని రోజుల్లో ఫిలిం ఛాంబర్ తేల్చనుంది.
(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ)


