హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ కావడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prasanth Varma) రేంజ్ మారిపోయింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ మూవీని నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) నిర్మించారు. ఆయన భారీగా లాభాలు కూడా అందుకున్నారు. అయితే, ఈ సినిమాకు సీక్వెల్గా రానున్న జై హనుమాన్ మూవీని నిరంజన్ రెడ్డి నిర్మించడం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే, నిర్మాత నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ మధ్య చాలా కాలంగా ఆర్థిక విభేదాలు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఇరువురు కూడా లేఖలతో నిర్మాతల మండలిని సంప్రదించడంతో అసలు విషయం బటయకు వచ్చింది.
ప్రశాంత్ వర్మపై నిరంజన్ రెడ్డి ఫిర్యాదు..
హనుమాన్ సినిమా తరువాత తమకు అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు చేస్తానని చెప్పి రూ 10.34 కోట్లు అడ్వాన్స్ ప్రశాంత్ వర్మ తీసుకున్నారని నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపారు. అయితే, డబ్బు తీసుకుని సినిమాలు చేయడం లేదని నిర్మాతల మండలిలో ప్రశాంత్పై ఫిర్యాదు చేశారు. పైగా రూ. 10.23 కోట్లు ఖర్చు పెట్టించి మరీ వేరే నిర్మాతల దగ్గర ఉన్న ఆక్టోపస్ సినిమాని కూడా తన చేత ప్రశాంత్ కొనిపించారని నిరంజన్ పేర్కొన్నారు. అయితే. ఆ సినిమాకు కనీసం NOC కూడా ఇప్పించడం లేదని ఛాంబర్లో నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ ఐదు సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద ప్రశాంత్ వర్మ నుంచి తమకు 200 కోట్లు నష్టపరిహారం కావాలని ఆయన కోరారు. అలాగే అధీరా సినిమా కోసం అడ్వాన్స్గా ఇచ్చిన కోటి రూపాయలు కూడా తిరిగి ఇప్పించాలని ఫిలిం ఛాంబర్కు చేసిన ఫిర్యాదులో నిర్మాత నిరంజన్ రెడ్డి కోరారు. తన ఆర్థిక పరిష్కారాలు క్లియర్ అయ్యే వరకు ఈ చిత్ర ప్రాజెక్టులను ఇతర నిర్మాణ సంస్థలతో కొనసాగించవద్దని నిరంజన్ రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం.
నా వాటా ఎగరగొట్టేందుకే ఈ నాటకాలు :ప్రశాంత్ వర్మ
నిర్మాత నిరంజన్ రెడ్డి ఆరోపణలపై ప్రతిస్పందనగా ప్రశాంత్ వర్మ తీవ్రంగా స్పందించారు. వివరణాత్మక పాయింట్-బై-పాయింట్ వివరణతో సుమారు 4 పేజీల లేఖను సమర్పించారు. నిరంజన్ రెడ్డి చర్యల వల్లే తనకు భారీ ఆర్థిక నష్టాలు, కెరీర్‌లో ఎదురుదెబ్బలు తగిలాయని ఆయన తెలిపారు. వాస్తంగా నిరంజన్ రెడ్డికి తాను ఏమీ రుణపడి లేనని చెప్పారు. 'అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస వంటి సినిమాలు నిరంజన్తో చేస్తున్నట్లు నేను ఎక్కడా చెప్పలేదు. మా ఇద్దరి మధ్య ఈ ప్రాజెక్ట్లకు సంబంధించి కనీసం అగ్రిమెంట్లు కూడా లేవు.
ఆక్టోపస్ సినిమా విషయానికొస్తే ఆ ప్రాజెక్ట్ నిర్మాతతోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. నేను డైరెక్ట్ చేసిన హనుమాన్ రూ. 295 కోట్లు రాబట్టింది. ఆ లాభాల నుంచి నాకు వాటా రావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు నాకు కేవలం 15.82 కోట్లు మాత్రమే అందింది. నాకు ఇవ్వాల్సిన వాటాను ఎగరగొట్టేసి.. ఆ డబ్బుతో డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్లా రంగ భాష ప్రాజెక్ట్లకు డైవర్ట్ చేశారు. ఇక అధీర సినిమా కోసం అడ్వాన్స్గా కోటి రూపాయలు ఇచ్చానంటున్నారు. అందులో నిజం లేదు. కేవలం అధీర టీజర్ డైరెక్ట్ చేసేందుకు మాత్రమే ఇచ్చారు. హనుమాన్ సినిమాకు వచ్చిన లాభాల్లో నా వాటను ఎగరగొట్టేందుకే ఈ స్టోరీ ప్లాన్ చేశారు.' అని ప్రశాంత్ వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇప్పుడు, పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఎవరు నిజం చెబుతున్నారు, న్యాయం ఎవరివైపు ఉంది? అనేది సమస్యగా మారింది. నిర్మాతల మండలి ద్వారా పరిష్కరించబడుతుందా లేదా కోర్టుకు వెళ్తుందా..? అనేది తేలేందుకు మరింత సమయం పడొచ్చు. ప్రశాంత్ వర్మ చుట్టూ ఆర్థిక వివాదాలు పెరుగుతున్నాయి. చాలా మంది నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ప్రశాంత్ వర్మ కెరీర్ పరిశ్రమలో విశ్వసనీయతకు కీలకం కానుంది.


